ఎక్కడన్నా కార్పొరేట్ కంపెనీలకు టార్గెట్లు వుంటాయి. పార్టీలకు కూడా అధికారంలోకి రావాలని లక్ష్యం వుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీకి ఓ కొత్త లక్ష్యం వుందని ఇప్పుడు తెలిసింది. పార్టీ కీలక నేత నారా లోకేష్ బాబే ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. అదేమింటే, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి వంద కోట్లకు చేరాలన్నది. ఈ నిధి ఎలా ఏర్పాటవుతుంది. విరాళాల ద్వారానే. తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చిన కొత్తలో నిత్యం ఎవరో ఒకరు లోకేష్ ను కలవడం, పార్టీ ఫండ్ చెక్ ఇచ్చి ఓ ఫోటో తీయించుకోవడం.
ఇలా ఇచ్చిన వారిలో రాజకీయ నాయకుల సంగతి పక్కన పెట్టచ్చు. ఎందుకంటే వారు ఏ పదవి కోసమో, పైరవీ కోసమో విరాళం ఇచ్చి వుండొచ్చు. పలు వ్యాపార ప్రముఖులు కూడా ఇలా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధికి విరాళాలు ఇస్తే ఏమనుకోవాలి? వారు ఏ ప్రయోజనాలు ఆశించకుండానే ఇచ్చారని ఎలా అనుకోవాలి. సరే, ఆ తరువాత ఈ వైనం సద్దుమణిగింది.
కానీ తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో లోకేష్ బాబు తన టార్గెట్ ప్రకటించారు. ప్రస్తుతం 60 కోట్ల ఫండ్ వుందట. నెలకి అయిదు కోట్లు వడ్డీ వస్తోందట. మరో ఏడాదిలో ఇది వంద కోట్లు కావాలట. అంటే ఏడాదిలో నలభై కోట్ల విరాళాలు రావాలన్నమాట. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అని, ఏడాదిలోనలభై కోట్లు పెద్ద విషయం కాదు. ఆ ధైర్యంతోనే లోకేష్ బాబు ఈ టార్గెట్ ఫిక్స్ చేసి వుంటారు. అవును ఇంతకీ, కార్యకర్తల సంక్షేమ నిధెే వంద కోట్లు అయితే, తెలుగుదేశం పార్టీ ఫండ్ ఏ మేరకు వుంటుందో ?