చంద్రబాబు ప్రపంచ రికార్డ్‌

చంద్రబాబునాయుడా.? మజాకానా.? బహుశా ఓ ప్రభుత్వ భవనాన్ని నిర్మించేందుకు, దాన్ని ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్‌ చేసినన్ని ఈవెంట్స్‌ ప్రపంచంలో ఇంకెవరూ చేసి వుండరేమో.! ఖచ్చితంగా చంద్రబాబునీ, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వాన్నీ గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించి తీరాల్సిందే.! 

ఇంకో పదిహేను రోజుల్లో విజయదశమి వచ్చేస్తోంది. సరిగ్గా ఏడాది క్రితం విజయదశమికే, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ప్రధానమంత్రి నరేద్రమోడీ ఆ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఏడాది పూర్తయ్యింది కదా.. శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అధికారిక భవనాల నిర్మాణం ఏమయినా ప్రారంభమయ్యిందా.? అనడక్కండి. ఏదో, అప్పటికి అలా ఓ ఈవెంట్‌ చేయాలని చంద్రబాబు ప్లాన్‌ చేశారంతే. ఈవెంట్‌ అయిపోయింది, ఆ తర్వాత రాజధాని నిర్మాణాన్ని చంద్రబాబు మర్చిపోయారు. 

కేంద్రం, రాజధాని అమరావతి నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చిందని చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పుకున్నారు. మరి, ఆ డబ్బులు ఏమైపోయాయ్‌.? సమాధానం దొరకదు. ఎందుకంటే, అక్కడున్నది చంద్రబాబు. పోనీ, ప్రధాని నరేంద్రమోడీ అయినా లెక్కలు అడుగుతున్నారా.? ప్చ్‌, ఆయనా అడగరు. మరి, రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ ఎవరు.? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

సరే, రాజధాని అమరావతి సంగతి పక్కన పెడదాం. అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన తాత్కాలిక సచివాలయం ఎక్కడిదాకా వచ్చింది.? అంటే, ఇదిగో పులి.. అదిగో తోక.. అన్న చందాన తయారయ్యింది పరిస్థితి. భవన సముదాయానికి ఓ రూపం వచ్చిందన్నది నిర్వివాదంశం. భూమిపూజ, శంకుస్థాపనకు ఓ ఈవెంట్‌ జరిగింది. ఆ తర్వాత మంచి ముహూర్తాల్లేవని చంద్రబాబు, పుష్కరాలకు ముందే ఓ సారి ప్రారంభోత్సవం చేసేశారు తన కార్యాలయానికి.  Readmore!

ఆ తర్వాతే అసలు ప్రసహనం మొదలయ్యింది. ఏ విభాగానికి ఆ విభాగం అందులో శంకుస్థాపనలు చేసేశాయి. హైద్రాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో, ప్రత్యేక రైళ్ళల్లో ఉద్యోగుల్ని సచివాలయ ప్రాంగణం కొలువుదీరిన వెలగపూడికి తరలించారు. పొద్దున్న హైద్రాబాద్‌లో బయల్దేరిన అమరావతి స్పెషల్‌.. సాయంత్రినికి తిరుగుటపా అయ్యింది హైద్రాబాద్‌కి. ఉద్యోగులు వెళ్ళారు, కొబ్బరికాయ కొట్టారు, తిరిగి హైద్రాబాద్‌కి పయనమయ్యారు. ఇదీ జరిగిన కథ. 

ఆ తర్వాత కూడా చాలా ఈవెంట్లు జరిగాయి. పలువురు మంత్రులు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తమ తమ కార్యాలయాల్ని ప్రారంభించారు. ఒకటికి రెండుసార్లు కార్యాలయాల్ని ప్రారంభించిన అమాత్యులూ వున్నారండోయ్‌. కట్టిన కార్యాలయాల్ని రీ-మోడలింగ్‌ పేరుతో బద్దలగొట్టించి, మళ్ళీ కట్టించేసుకున్నారు కూడా. అలా అలా కుప్పలు తెప్పలుగా ఈవెంట్లు జరిగాక.. ఇప్పుడు తాజాగా మరో మేజర్‌ ఈవెంట్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారట. 

అక్టోబర్‌ 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచి పాలన సాగనుందనే ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. ఇంకోసారి తన కార్యాలయాన్ని వెలగపూడి సచివాలయంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దల్నీ ఈ ఈవెంట్‌కి ఆహ్వానించే పనిలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. పెళ్ళి.. జరగాలి మళ్ళీ మళ్ళీ.. అనట్లు తయారయ్యింది వెలగపూడి సచివాలయ ప్రారంభోత్సవ ప్రసహనం. 

ఇప్పుడు చెప్పండి.. ఈ ప్రారంభోత్సవాల చెత్త రికార్డ్‌ని గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కించాలా.? వద్దా.?

Show comments

Related Stories :