ఎంతమంది వచ్చినా చోటున్నది లోపల అంటాడు వెనకటికో కవి. చిరంజీవి 150 వ సినిమా కత్తిలాంటోడు (ఇది తాత్కాలిక నామధేయం మాత్రమే) సినిమా సంగతి అలాంటిదే. తమిళ సినిమా తెచ్చారు. అంటే కథ వండి వార్చేసినదే. దానిపై పరుచూరి బ్రదర్స్ విపరీతంగా పనిచేసారు.
ఇక్కడ హైదరాబాద్ లో అక్కడ విశాఖలో ఏకాంతంగా కూర్చుని మరీ. వివి వినాయక్ అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆకుల శివ హ్యాండ్ వుండనే వుంటుంది. ఇప్పుడు మరో రైటర్ కూడా తోడయ్యారని తెలుస్తోంది. గోపాల గోపాల సినిమాతో పవర్ స్టార్ మనసు గెల్చుకున్న రచయిత బుర్రా సాయిమాధవ్ కూడా కత్తిలాంటోడు సినిమాకు పని చేస్తున్నారు.
శాంపిల్ గా కొన్ని ఎమోషన్లు సీన్లు రాయమని మెగాస్టార్ అడిగినట్లు తెలుస్తోంది. అలా రాసిన సీన్లు అదిరిపోవడంతో, మెగాస్టార్ వెంటనే మరి కొన్ని సీన్లు కూడా బుర్రా కు అప్పగించేసారని తెలుస్తోంది. ఇలా అప్పగించిన వాటిలో క్లయిమాక్స్ కూడా వుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏమిటో చిరు 150 వ సినిమాకు హీరోయిన్ తప్ప అందరూ దొరుకుతున్నట్లుంది.