శ్రీకాంత్‌ విలన్‌గా నటించాలంటే.?

ఒకప్పుడు కుర్ర విలన్‌గా చాలా సినిమాల్లో నటించాడు శ్రీకాంత్‌. నాగార్జున హీరోగా వచ్చిన 'ప్రెసిడెంటుగారి పెళ్ళాం' చిత్రంలో హీరోయిన్‌కి సోదరుడిగా నటించిన శ్రీకాంత్‌, ఆ సినిమాలో విలనిజం బాగానే పండించాడు. విలన్‌ కాదు, విలన్‌ కొడుకుగా తనదైన నటనటతో ఆకట్టుకున్నాడు. అలా కొన్ని సినిమాల్లో యంగ్‌ విలన్‌ పాత్రల్లో కనిపిచాడు శ్రీకాంత్‌. 

తర్వాత్తర్వాత హీరోగా అవకాశాలు రావడంతో, మళ్ళీ విలనిజం వైపు శ్రీకాంత్‌ మక్కువ చూపలేదు. 'ఆపరేషన్‌ దుర్యోధన' సినిమాలో మాత్రం నెగెటివ్‌ టచ్‌ వున్న పాత్రలో నటించి మెప్పించాడనుకోండి.. అది వేరే విషయం. 'ఆపరేషన్‌ దుర్యోధన' తర్వాత చాలా సినిమాల్లో శ్రీకాంత్‌కి నెగెటివ్‌ రోల్స్‌ని ఆఫర్‌ చేశారట దర్శక నిర్మాతలు. కానీ, శ్రీకాంత్‌ ససేమిరా అనేశాడు. 

ప్రస్తుతం ట్రెండ్‌ మారుతోంది. హీరోగా అవకాశాలు తగ్గడంతో నెగెటివ్‌ రోల్స్‌ వైపు మొగ్గు చూపుతున్నారు కొందరు సీనియర్లు. రాజశేఖర్‌ తనకు విలన్‌గా నటించాలని వుందంటూ మనసులో మాటని బయటపెట్టాడు. జగపతిబాబు సంగతి సరే సరి. 'లెజెండ్‌' సినిమాతో విలనిజం పండించాడు.. పలు సినిమాల్లో విలన్‌గా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. విలన్‌గా చేస్తూనే, 'శ్రీమంతుడు' లాంటి చిత్రాల్లో పాజిటివ్‌ క్యారెక్టర్లలోనూ మెప్పిస్తున్నాడు జగపతిబాబు. 

ఇక, తనకూ నెగెటివ్‌ టచ్‌ వున్న పాత్రల్లో కనిపించాలని వుందనీ, అయితే దానికి తగ్గ బలమైన పాత్రను ఎవరైనా తనకు ఆఫర్‌ చేస్తే, తప్పకుండా ఆ సినిమాలో నటించేందుకు తాను సిద్ధమని శ్రీకాంత్‌ చెప్పుకొచ్చాడు. అయితే, ఆ సినిమా పెద్ద హీరోది అయి వుండాలట. చాలా స్టైలిష్‌ విలన్‌గా తన పాత్ర వుండాలట. ఇలా చాలా షరతులే వున్నాయంటున్నాడు హీరో శ్రీకాంత్‌, విలన్‌గా కనిపించడానికి.  Readmore!

చిరంజీవి హీరోగా వచ్చిన 'శంకర్‌దాదా' సిరీస్‌లో ఏటీఎం పాత్రలోనూ, 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో హీరోకి బాబాయ్‌గానూ కనిపించిన శ్రీకాంత్‌, ముందు ముందు స్టైలిష్‌ విలనిజంని పండిస్తాడేమో వేచి చూడాల్సిందే.

Show comments