దానికీ చంద్రబాబే అడ్డుపుల్ల.?

'ప్రత్యేక హోదా అవసరం లేదు.. ఇచ్చేదేదో ప్యాకేజీ రూపంలో ఇచ్చేయండి.. హోదా కన్నా, ప్యాకేజీ పేరుతో వచ్చే డబ్బులే ముద్దు..' 

- ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారి తీరు. 

ఒకప్పుడు ప్రత్యేక హోదా సంజీవని అన్నారు.. ఐదేళ్ళు కాదు, పదేళ్ళు కాదు.. పదిహేనేళ్ళు కావాలన్నారు.. ఆ తర్వాత దాన్నీ అటకెక్కించేశారు. అసలిప్పుడు ప్రత్యేక హోదా దండగ అని చంద్రబాబు సెలవిస్తున్నారు. అంతేనా, ప్రత్యేక హోదాతో లాభం లేకపోగా, నష్టమేనని ఇటు చంద్రబాబు అటు వెంకయ్య.. ఓ రేంజ్‌లో కథలు చెబుతున్నారు. 

పోనీ, ప్రత్యేక ప్యాకేజీ అయినా వచ్చేనా.? అంటే, దానికీ దిక్కులేదాయె.! విభజన చట్టంలోని అంశాలన్నిటినీ ప్యాకేజీలోకి మార్చేసి, దాన్ని 'ప్రత్యేక సాయం' అంటూ కొత్త కథ విన్పించారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ. ఆ ప్రత్యేక సాయానికి ఇప్పటిదాకా అతీ గతీ లేని పరిస్థితి. 'కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించాక, ఇంకా దానికి చట్టబద్ధత ఏంటి.?' అన్నది బీజేపీ వాదన. అంతకు ముందేమో, ప్రధాని హోదాలో మన్మోహన్‌సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చినా.. చట్టంలో పేర్కొనలేదు కాబట్టి ప్రత్యేక హోదా చెల్లదని ఇదే బీజేపీ నేతలు చెబుతున్నారు. 

ఇదిలా వుంటే, కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారీ తెలుగు మీడియాలో ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అన్న అంశంపై రచ్చ జరుగుతోంది. ప్రధానంగా టీడీపీ అనుకూల మీడియా, 'ఇదిగో చట్టబద్ధత.. అదిగో చట్టబద్ధత..' అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఈసారీ అదే జరుగుతోంది. ఇప్పటిదాకా ఆలస్యమవడానికి కారణం చంద్రబాబేనట. 'అంతకు మించి' చంద్రబాబు అడుగుతుండడమే ప్యాకేజీ చట్టబద్ధత ఆలస్యమవుతుండడానికి కారణమట. 

నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది ఈ మొత్తం ఎపిసోడ్‌. బీహార్‌ ఎన్నికల్లో ప్యాకేజీకి వేలంపాట పెట్టారు ప్రధాని నరేంద్రమోడీ. జమ్మూకాశ్మీర్‌కీ ఇదే తరహాలో ఆయన హడావిడి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన ఏ విషయంలోనూ అసలు మాట్లాడేందుకే మోడీ ఇష్టపడటంలేదాయె. అలాంటప్పుడు, మోడీ హయాంలో ప్రత్యేక హోదా వస్తుందా.? ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత వస్తుందా.? ఛాన్సే లేదు. అయినా, 'మాకిది కావాలి..' అని గట్టిగా చంద్రబాబు అడగనప్పుడు, మోడీ మాత్రం అంత ఇంట్రెస్ట్‌ ఎందుకు చూపుతారట.? ప్రత్యేక హోదాకీ చంద్రబాబే అడ్డం.. ప్యాకేజీకి కూడా ఇప్పుడాయనే అడ్డం అనుకోవాలేమో.!

Show comments