'అమ్మ' అన్నది ఒక కమ్మని మాట...!

నిన్న మొన్నటివరకు కావేరీ జల వివాదంతో అట్టుడికిపోయిన తమిళనాడు (కర్నాకటక కూడా) ఇప్పుడు విషాదంలో మునిగివుంది. ప్రధానంగా అధికార పార్టీ అన్నా డీఎంకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు...ఇలా అందరూ ఒక్కటే కోరుకుంటున్నారు. ఏమని? 'అమ్మ'కు ఏమీ కాకూడదు. ఆమె ఆరోగ్యంగా తిరిగి రావాలి' అని. స్వల్ప అనారోగ్యంతో (జ్వరం)  రెండు రోజుల క్రితం చెన్నయ్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన జయలలిత ఆరోగ్యం విషమిస్తోందనే వార్త తమిళనాడులో కార్చిచ్చులా వ్యాపిస్తోంది. 

అసలు విషయమేమటో తెలియదు. కాని జయ ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం రావడంతో రాష్ట్రం విషాదంలో మునిగివుంది. ఇందుకు ప్రధాన కారణం..అమ్మను చికిత్స కోసం సింగపూర్‌కు తరలించబోతున్నారనే వార్త హల్‌చల్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకే నాయకులు, అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. ఆస్పత్రిలో చేరగానే అబ్జర్వేషన్లో ఉంచిన వైద్యులు ఇప్పుడు సింగపూర్‌కు తరలించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా భావిస్తున్నారు. బలమైన కారణం లేనిదే విదేశానికి తరలించరని అనుకుంటున్నారు. 

జయలలితకు ఇదివరకే మధేమేహం (సుగర్‌) ఉంది. వైద్య పరీక్షల్లో కిడ్నీ సంబంధిత వ్యాధి కూడా ఉన్నట్లు తెలిసిందని చెబుతున్నారు. ఆమె సింగపూర్‌కు తీసుకెళ్లినట్లు నిర్ధారణగా తెలియకపోయినా మీడియా సమాచారాన్ని బట్టి తీసుకెళతారని అర్థమమవుతోంది. సాధారణంగా పాలకులు, నాయకులు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రిలో చేరితో అభిమానులు ఆందోళనపడటం సహజం. 'వీరాభిమానం' ఉన్న తమిళనాడులో ఆందోళన మరింత ఎక్కువగా ఉంటుంది. అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలకు 'అమ్మ' అన్నది ఒక కమ్మని మాట' కదా. ఆమెకు ఏమైనా అయితే తట్టుకోలేరు. అందుకే ఆలయాల్లో భారీ ఎత్తున పూజలు చేస్తున్నారు. మసీదుల్లో, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. 

ఆమెను చేర్చిన ఆస్పత్రి వద్ద అన్నం నీళ్లు మానేసి పడిగాపులు పడుతున్నారు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడి నుంచి కదలడంలేదు. 'అమ్మకు ఆరోగ్యం బాగాలేదు' అనే సమాచారం గురువారం అర్థరాత్రి ఒక్కసారిగా గుప్పుమంది. క్షణాల్లోనే వందలాదిమంది అపోలో ఆస్పత్రి దగ్గర గుమిగూడారు. చిన్నా పెద్దా ముసలీ ముతక పరుగులు తీస్తూ వచ్చారు. ఆస్పత్రి దగ్గరే అందుబాటులో ఉన్నది తింటూ ఆమె ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. తట్టుకోలేని అభిమానులు, కార్యకర్తలు భోరున విలపిస్తున్నారు. అమ్మ చేసిన 'ఉచిత సహాయాలు' గురించి తలచుకుంటున్నారు.  Readmore!

'ఆమె మా పిల్లలకు సైకిళ్లు ఇచ్చింది. ల్యాప్‌టాప్స్‌ ఇచ్చింది. తక్కువ ధరకు ఆహారం అందిస్తోంది. ఇంత మంచి అమ్మకు ఏమీ కాకూడదు' అని కొందరు కన్నీరుమున్నీరయ్యారు. అభిమాన నాయకులు ఆస్పత్రిలో చేరినప్పుడు గోరంతలు కొండంతలుగా పుకార్లు వ్యాపిస్తుంటాయి. టీవీ ఛానెళ్లలోనూ అందిన సమాచారాన్ని అందినట్లు ప్రసారం చేస్తుంటారు. ఇప్పుడూ అలాగే జరుగుతోందని కొందరు చెబుతున్నారు. ఆమెకు అసలేమైందనేది సరిగ్గా తెలియకపోయినా కొంతకాలంగా 'జయ ఆరోగ్యం బాగాలేదు' అని మీడియాలో వార్తలొస్తున్నాయి. 

దీన్ని పూర్తిగా కొట్టేసేందుకు వీల్లేదు. ఆరోగ్యం బాగాలేదంటూ ఆమె అనేక కార్యక్రమాలకు హాజరుకాని దాఖలాలున్నాయి. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అంత్యక్రియలు తమిళనాడులోని ఆయన స్వగ్రామంలోనే జరిగాయి. అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోతున్నానని ఆమె ప్రకటన విడుదల చేశారు. ఆమెకు ఆరోగ్యం బాగాలేదంటే అన్నా డీఎంకే నాయకులు మండిపడతారు. 'జయలలిత ఆరోగ్యం బాగాలేదని ఎవరైనా అంటే వారి నాలుక కోసేస్తాను' అంటూ ఓసారి ఓ అన్నాడీఎంకే ఎంపీ వీరంగం వేశాడు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ ఆమె బద్ధశత్రువైన డీఎంకే అధినేత కరుణానిధి సహా అనేకమంది సందేశాలు పంపారు. 

తెలంగాణలో కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఆయన ఆరోగ్యం మీద అనేక పుకార్లు వచ్చాయి. చికిత్స కోసం త్వరలో అమెరికా కూడా వెళ్లబోతున్నారని కొందరు చెప్పారు. కేసీఆర్‌ కూడా కొన్ని సందర్భాల్లో వైరాగ్యంగా మాట్లాడి నిజంగానే ఆరోగ్యం బాగాలేదేమోననే భావనను మరింత పెంచారు. ఇప్పటివరకైతే ఆయన ఎలాంటి ఢోకా లేకుండా బాగానే ఉన్నారు. ఆరోగ్యం బాగాలేకపోవడం సామాన్యులకైనా, గొప్ప నాయకులకైనా ఒకటే. కాకపోతే నాయకుల విషయంలో అభిమానం కారణంగా జనం భావోద్వేగాలకు లోనవుతుంటారు. 

Show comments