ట్రంప్ దెబ్బ: ఇండియన్ ఐటీ అతలాకుతలమే?

హెచ్ 1 బీ వీసాల బిల్లు విషయంలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలు భారత ఐటీ ఇండస్ట్రీ పై గట్టి దెబ్బ కొట్టనున్నాయని స్పష్టం అవుతోంది. వీసాల జారీకి సంబంధించి నిబంధనల్లో మార్పు, దీంతో పాటు అమెరికన్ల అవకాశాలపై దెబ్బకొట్టి ఔట్ సోర్సింగ్ ద్వారా పనులు చేయించుకుంటున్న అమెరికన్ కంపెనీలకు రాయితీల రద్దు కూడా ఈ బిల్లులోని మరోప్రముఖమైన అంశం. దీంతో అటు భారతీయ ఐటీ ఉద్యోగుల మీద, ఇటు భారతీయ ఐటీ కంపెనీల మీద ఈ ప్రభావం తీవ్రంగానే ఉండనుంది.

అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే.. హెచ్ 1 బీ వీసాలతో అమెరికాలో పని చేస్తున్న భారతీయుల ఉద్యోగుల సంఖ్య 3.5 లక్షలు అని తెలుస్తోంది. విస్మయకరమైన అంశం ఏమిటంటే.. వీరిలో 83 శాతం మంది వేతనాలు ప్రస్తుత ప్రతిపాదన స్థాయికి లేవు! హెచ్ వన్ బీ వీసా కింద పని చేయడానికి ఉండాల్సిన కనీస వేతనం 1.3లక్షల డాలర్లు అని ట్రంప్ సర్కార్ అంటోంది. భారతీయ ఉద్యోగుల్లో కేవలం 13 శాతం మంది ఈ స్థాయి జీతాలు పొందుతున్నారు. అంటే.. బిల్లు పాస్ అయితే కేవలం 50 వేల మంది మాత్రమే అక్కడ ఉండగలరు.. మిగిలిన వారు తిరుగుముఖం పట్టాల్సి ఉంటుంది!

ఇక కంపెనీల దయ మీద ఆధారపడిన వారు మరో పదిహేడు శాతం మంది ఉంటారు. వీరి జీతం అటు ఇటుగా లక్ష డాలర్ల స్థాయిలో ఉంది. కొంత హైక్ ఇస్తే.. వీరు కొత్త నిబంధనల పరిధిలోకి వస్తారు. అంటే వీరి సంఖ్య మరో డెబ్బై వేల మంది వరకూ ఉండొచ్చు! ఇంత చేసినా కేవలం లక్ష ఇరవై వేల మంది ఐటీ ఉద్యోగులు మాత్రమే అక్కడ ఉండటానికి అర్హత పొందుతారు. మిగిలిన రెండులక్షల ముప్పై వేల మంది మాత్రం ఇంటికి తిరిగి రాక తప్పేలా లేదు!
ఉద్యోగులను అమెరికాకు పంపి పని చేయించుకుంటున్న భారతీయ కంపెనీలు ఇప్పటికే మనోళ్ల మీద ఆశలు వదిలేసుకున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అమెరికన్ వర్సిటీ దగ్గర చేరిపోయాయి. అక్కడ రిక్రూట్ మెంట్లను మొదలుపెట్టాయి! ఈ నియామకాలకు భారతీయ విద్యార్థులను రానీయడం లేదు కూడా! దీంతో పరిస్థితి ఎలా ఉందో స్పష్టం అవుతోంది. 

మరి ఒక్కసారిగా రెండు లక్షల మంది భారతీయ ఐటీ నిపుణులు అమెరికా నుంచి తిరుగుముఖం పడితే.. స్థానికులకు సహజంగానే అవకాశాలు ఒక రేంజ్ లో పెరుగుతాయి. ట్రంప్ నిర్ణయం ఎంత వేగంగా ఫలితాలను ఇస్తోందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎటొచ్చీ రెండు లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఒక్కసారిగా ఇండియాకు తిరిగొస్తే.. ఇక్కడి పరిస్థితి ఏమిటి? అతలాకుతలమేనా? కంపెనీలు ఆ ఉద్యోగులను ఉంచుకుంటాయా? తొలగిస్తాయా? వాళ్లంతా తిరిగి వచ్చేస్తే.. ఇక్కడ ఉద్యోగాల వేటలో ఉన్న వారి పరిస్థితి ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిపై ఇప్పటి వరకూ ప్రముఖ ఐటీ కంపెనీలు ఏవీ నోరు విప్పలేదు! 

Show comments