సెలబ్రిటీలు పార్టీలు చేసుకోవడం చాలా చాలా సాధారణమైన విషయం. గత పది పదిహేనేళ్ళుగా ఈ పార్టీలు కాస్త 'వైల్డ్'గా మారిపోయాయన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలాంటి పార్టీల్లోంచి కొన్ని ఫొటోల్ని తీసుకొచ్చి, వాటికి 'పోర్న్ కంటెంట్'ని జత చేసి, సోషల్ మీడియాలో కొందరు 'ఔత్సాహికులు' తమ ప్రతాపం చూపిస్తున్నారు.
ఫలానా హీరోయిన్ న్యూడ్ వీడియో అనీ, ఫలానా హీరో - హీరోయిన్ 'ఇంటిమేట్ సీన్స్' అనీ.. సోషల్ మీడియాలో ఎడా పెడా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఫొటోలు, వీడియోలు, ఆడియో టేప్‌లు క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా సర్క్యులేట్ అవుతున్నాయంటే, అదంతా ఇంటర్నెట్ పుణ్యమే. స్మార్ట్ ఫోన్లు వచ్చాక.. ఇవి మరింత వేగంగా ప్రపంచానికి పాకేస్తున్నాయి. నిజం, గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా పాకేస్తుందన్నట్లు.. ఏదన్నా 'లీక్' అయితే చాలు, అది క్షణాల్లో ప్రపంచమంతటికీ తెలిసిపోతోంది.
ఆ వీడియోలో నిజమెంత.? అనేది ఎవరికీ అనవసరం. ఇప్పుడు 'సుచీ లీక్స్' వ్యవహారం కూడా అలాగే తయారయ్యింది. సింగర్ సుచిత్ర పేరుతో, 'సుచి లీక్స్' సోషల్ మీడియాలో సంచలనాత్మక వ్యవహారంగా మారింది. ఇందులో కనిపించేవన్నీ బూతు వీడియోలే.. వాటితోపాటుగా, సెలబ్రిటీల ఫొటోలు. ఆ వీడియోల్లో వున్నది కూడా సెలబ్రిటీలేనన్నది 'సుచీ లీక్స్'లో కన్పిస్తున్న పోస్ట్‌ల సారాంశం.
టాలీవుడ్, కోలీవుడ్‌కి చెందిన పలువురు నటీనటుల 'ప్రైవేట్ వీడియోస్' అంటూ సుచి లీక్స్ ద్వారా పోస్ట్ కాబడ్తున్న ఆ వీడియోలు, క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. ఓ హీరోయిన్ ఇప్పటికే ఈ వ్యవహారాన్ని ఖండించింది. మరికొందరు సెలబ్రిటీలదీ ఇదే తీరు. అయినాసరే, ఈ బూతు కంటెంట్ మాత్రం ఆగడంలేదు. తాజాగా మరికొన్ని వీడియోలు అత్యంత అసభ్యకరంగా సుచి లీక్స్ పేరుతో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసేస్తున్నాయి. ఇలాంటప్పుడే 'ఇంటర్నెట్‌కి సెన్సార్ అవసరం' అన్పిస్తుంది.