తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ఏప్రిల్ 2వ తేదీన 'బిగ్ న్యూస్' చెప్పబోతున్నాడట. అది రాజకీయ రంగ ప్రవేశం గురించేనట. తమిళనాడులో ఇప్పుడు తలైవా అభిమానులు తమ అభిమాన హీరో, రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ ఓ రేంజ్‌లో సందడి షురూ చేసేశారు మరి.! దానిక్కారణం, రజనీకాంత్ నుంచి అభిమాన సంఘాల ముఖ్య నేతలకు పిలుపు రావడమే.
ఏప్రిల్ 2వ తేదీన అభిమాన సంఘాలకు చెందిన ముఖ్య నేతలు (నేతలంటే అభిమాన సంఘాల అధ్యక్షులన్నమాట..), రజనీకాంత్‌తో భేటీ అవుతారట. ఈ మేరకు అభిమాన సంఘాలకు, రజనీకాంత్ నుంచి స్వయంగా ఆహ్వానాలు అందాయి. రజనీకాంత్ అభిమాన సంఘాల నేతలంటే, పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వుంటాన్నది అభిమానుల అంచనా. ఆ లెక్కన, ఏప్రిల్ 2న చిన్నపాటి బహిరంగ సభ తరహాలో ఈ మీటింగ్ జరిగే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
తాజాగా, నిన్ననే రజనీకాంత్ సతీమణి లత, ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెను మీడియా, రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రశ్నిస్తే, 'చర్చలు జరుగుతున్నాయి.. త్వరలో ఆయన స్వయంగా అన్ని విషయాలూ మాట్లాడతారు..' అని చెప్పారు. ఇంతలోనే, రజనీకాంత్ అభిమానులకు 'మీటింగ్'పై సమాచారం అందింది. అంటే, ఏప్రిల్ 2వ తేదీనే రజనీకాంత్, తన అభిమానులకు రాజకీయ రంగ ప్రవేశంపై తన మనసులోని మాటను చెప్పబోతున్నారన్నమాట.
తమిళ రాజకీయాల్లో నెలకొన్న పొలిటికల్ వాక్యూమ్ నేపథ్యంలో, రజనీకాంత్ రాజకీయ నాయకుడిగా అవతరించి, అధికార పీఠమెక్కాలనే కసితో వున్నారన్నదానిపై ఇప్పుడు దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. ఆయన కసితో వున్నారు సరే, జనం ఆయన్ని రాజకీయ నాయకుడిగా చూస్తారా.? తెలుగునాట చిరంజీవి, తమిళనాట విజయ్‌కాంత్.. రాజకీయాల్లోకి వెళ్ళి ఏమయ్యారో అందరికీ తెల్సిందే. మరి, రజనీకాంత్ చేస్తున్న ఈ సాహసం ఎలాంటి ఫలితాలనిస్తుందో వేచి చూడాల్సిందే.