ఏదో ఒక పార్టీలో చేరడం అయితే ఖాయమే అంటూనే.. ఇంతకీ ఏ పార్టీలో చేరేదీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రెండున్నర సంవత్సరాల నుంచి రాజకీయ అచేతన స్థితిలో, మీడియాకు బోలెడంత దూరంగా గడుపుతున్నాడు కిరణ్. ఎన్నికల ఫలితాల అనంతరం కనీసం.. వాటిపై తన స్పందన కూడా వ్యక్తం చేయలేదు. ఎన్నికల ముందు రాజకీయ పార్టీని స్థాపించి.. చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థిలను నిలిపిన కిరణ్.. కనీసం ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయాడు. ఫలితాల తర్వాత కిరణ్ కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదు.
ఎన్నికల్లో ఓడటం తప్పు కాదు కానీ.. మరీ వివరణ కూడా ఇవ్వకపోవడం మాత్రం కిరణ్ తీరేమిటో అర్థమయ్యేలా చేసింది. ముఖ్యమంత్రిగా ఉన్నంత సేపూ హడావుడి చేసి.. పరువు పోయిన సందర్భంలో మాత్రం కిరణ్ మొహం చాటేశాడు. ఇలాంటి వ్యక్తి ఇకపై ఏదైనా పార్టీలో సర్దుకోగలడా? ఏ పార్టీ అయినా కిరణ్ కు గౌరవాన్ని ఇచ్చి పిలుచుకుంటుందా? అనేవి సందేహాలే!
అయితే కిరణ్ మాత్రం.. చర్చలు జరుగుతున్నాయని అన్నారు. చాన్నాళ్ల తర్వాత జనం ముందుకు వచ్చిన కిరణ్ ను జపాలే ఆయన రాజకీయ భవితవ్యం గురించి ఆసక్తిగా అడిగారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఇంకా సంప్రదింపులు జరుగుతున్నాయనే అర్థాన్ని ఇచ్చేలా మాట్లాడాడు.
మరి ఇంతకీ ఆ సంప్రదింపులు ఎవరితో? ఏ పార్టీతోనో కిరణ్ చెప్పలా. బీజేపీతోనా, తెలుగుదేశంతోనా, లేక కాంగ్రెస్ తోనా.. అనే విషయం మిస్టరీగానే మిగిలింది.