రమ్య హటావో.. దేశ్‌ బచావో.!

ఈ దేశానికి ఏమయ్యింది.? అని దేశ ప్రజలు నిట్టూర్చాల్సిన సందర్భమిది. ఓ పక్క పొరుగుదేశం పాకిస్తాన్‌, మన దేశంలో అంతర్గత కల్లోలాల్ని పెంచి పోషిస్తోంటే, ఇక్కడ రాజకీయాలేమో ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. దేశమంతా ఒక్క మాట మీద వుండాల్సిన తరుణంలో, దేశంలో 'భిన్నత్వం' ఎక్కువైపోతోంది. భిన్నత్వంలో ఏకత్వం.. ఏకత్వంలో భిన్నత్వమే మన ప్రజాస్వామ్యం తాలూకు గొప్పతనం. కానీ, సందర్భమంటూ వుంటుంది కదా దేనికైనా.! 

ఎప్పటినుంచో కాశ్మీర్‌ విషయంలో భారత్‌పై పాకిస్తాన్‌ వెర్రికేకలు పెడ్తోంది. కానీ, ఇప్పుడా కేకలు కాస్తా, కాశ్మీర్‌ని రావణకాష్టంగా మార్చేస్తున్నాయి. దాంతో, భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌కి అల్టిమేటం జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో దేశంలో ఎవరైనాసరే, కేంద్ర ప్రభుత్వానికి అండగా వుండాలి. ఇక్కడ కేంద్రంలో అధికారంలో వున్నది భారతీయ జనతా పార్టీ కదా.. అన్న ఆలోచన ఎవరు చేసినాసరే, అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటుండదు. మనం, మన దేశం.. అన్న భావన వుంటే తప్ప, దేశం తరఫున మనం పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెప్పడానికి వీలుండని పరిస్థితి. 

మొన్నామధ్య ప్రధాని నరేంద్రమోడీ రహస్య పర్యటన చేశారు పాకిస్తాన్‌కి. పూర్తిగా రహస్యమేమీ కాకపోయినా, చివరి వరకూ ఆ పర్యటనను రహస్యంగా వుంచింది భారత ప్రభుత్వం. పాముతో అయినా స్నేహం చేయొచ్చు.. ల్యాండ్‌ మైన్‌ మీద కూడా కూర్చోవచ్చు.. కానీ, పాకిస్తాన్‌తో స్నేహం చెయ్యకూడదని పాకిస్తాన్‌ ఇంకోసారి భారత్‌కి గుణపాఠమే చెప్పింది. అప్పుడుగానీ, తన రహస్య పర్యటన ఎంత దారుణంగా విఫలమయ్యిందో నరేంద్రమోడీకి అర్థం కాలేదు. 

దేశమంతా వద్దంటున్నా, నరేంద్రమోడీ రెక్కలు కట్టుకుని పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చి సాధించిందేమిటి.? అప్పుడు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో ముచ్చట్లు పెట్టి వచ్చారు నరేంద్రమోడీ. ఇప్పుడేమో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, పాకిస్తాన్‌ని నరకంతో పోల్చుతున్నారు. అలాగైతే, ఆ నరకంలోకి నరేంద్రమోడీ ఎందుకు వెళ్ళినట్లు.? దీనికి మాత్రం సమాధానం వుండదుగాక వుండదు.  Readmore!

ఇంకోపక్క, ఇటీవలే సినీ నటి రమ్య పాకిస్తాన్‌కి వెళ్ళొచ్చారు. ఆమె కేవలం సినీ నటి అయితే సమస్య ఏమీ లేదు. కానీ, ఆమె ఓ రాజకీయ నాయకురాలు. పైగా, ఎంపీగా పనిచేశారు గతంలో. 'పాకిస్తాన్‌ నరకమేమీ కాదు, నాకు అక్కడ చాలా గౌరవం, మర్యాదా, ఘనమైన ఆహ్వానం, ఆతిథ్యం లభించాయి..' అని సెలవిచ్చి వివాదాన్ని రాజేశారు రమ్య. మామూలుగా అయితే, రమ్య మాటల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదు. 

కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరు. పాకిస్తాన్‌ - భారత్‌ మధ్య యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. కాంగ్రెస్‌ ఓ పక్క, నరేంద్రమోడీ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేస్తోంది పాకిస్తాన్‌ విషయంలో. కాంగ్రెస్‌కి చెందిన మాజీ ఎంపీనే కదా.. అంటూ రమ్య కూడా తనవంతుగా రాజకీయ మంటల్లో ఆజ్యం పోసేశారు. రమ్య వ్యాఖ్యలకు నిరసనగా కర్నాటకలో ఆందోళనలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా 'రమ్య హటావో, దేశ్‌ బచావో..' అనే నినాదాలు జోరందుకున్నాయి. 

రమ్యని దేశం నుంచి బహిష్కరిస్తే, దేశం బాగుపడిపోతుందా.? నాన్సెన్స్‌. అదే సమయంలో, పాకిస్తాన్‌లో ఆతిథ్యం బాగుంటే బాగుండొచ్చుగాక.. కానీ, పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా దేశ ప్రజల సెంటిమెంట్లు రెచ్చగొట్టడం రమ్యకు తగదు. కేసులు, ఆందోళనలు, అరెస్టులు, లాఠీఛార్జీలు.. ఇవన్నీ అవసరమా ఇప్పుడు.?

Show comments