అమరావతిలో ఐటీ: లోకేష్‌ రిబ్బన్‌ 'కటింగ్‌'

విశాఖపట్నం ఉస్పూరుమంటోంది.. తిరుపతి తికమకపడ్తోంది.. ఇంతలోనే అమరావతిలో ఐటీ వెలుగులంటూ అధికార పార్టీ హడావిడి షురూ చేసేసింది. కొన్నాళ్ళ క్రితమే అమరావతి పరిధిలోని విజయవాడలో కొన్ని ఐటీ సంస్థల కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. 'హైద్రాబాద్‌కి ధీటుగా అమరావతిలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం..' అంటూ అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెలవిచ్చారు. 

తాజాగా, చినబాబు వంతు. మంత్రి హోదాలో తొలిసారిగా, ఐటీ సంస్థల ప్రారంభోత్సవం చేశారు నారా లోకేష్‌. గన్నవరం మేధాటవర్స్‌లో ఏడు ఐటీ సంస్థల ప్రారంభోత్సవం నేపథ్యంలో రిబ్బన్‌ 'కటింగ్‌' చేసేశారు. 2 లక్షల ఉద్యోగాలే టార్గెట్‌.. అంటూ, నారా లోకేష్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ గురించి తెగ చెప్పేస్తున్నారు. మొన్న చంద్రబాబు.. ఇప్పుడు చినబాబు.. ఐటీ సంస్థల ప్రారంభోత్సవాలతో చేస్తున్న ఈ హంగామా అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

ఎందుకంటే, ఒకప్పుడు ఐటీ రంగానికి విశాఖను కేరాఫ్‌ అడ్రస్‌గా చేస్తామన్నారు చంద్రబాబు. హుద్‌హుద్‌ తుపాను దెబ్బకి విశాఖను వదిలేశారాయన. ఐటీ ఇప్పుడక్కడ ఊస్సూరుమంటోంది. విశాఖలో ఐటీ.. అంటూ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర యువత నీరుగారిపోయింది. మరోపక్క, తిరుపతి పరిసరాల్లో ఐటీ సంస్థల విస్తరణకు అవకాశాలున్నాయంటూ ఆ మధ్య హడావిడి చేసి, తుస్సుమనిపించేశారు. ఉత్తరాంధ్ర ఏం పాపం చేసింది.? రాయలసీమ చేసిన నేరమేంటి.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే.. వాళ్ళంతా అభివృద్ధి వ్యతిరేకులే. 

పోనీ, విజయవాడ కేంద్రంగా (పేరుకి అమరావతి అయినా.. కొందరి బాగు కోసం.. విజయవాడ మీదే బాబుగారి ఫోకస్‌ వుంది లెండి..) ఐటీ రంగాన్ని చంద్రబాబు సర్కార్‌ అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధి చూపిస్తుందా.? అనంటే, మూడేళ్ళు కాలయాపన చేసి, ఇప్పుడు హడావిడి చేయడమంటే, ఈ 'కటింగ్‌'లు ఎవరి కోసమట.. అన్న సందేహం రాకుండా ఎలా వుంటుంది.! 

ఒక్కటి మాత్రం నిజం.. ఐటీ రంగం ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది, వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. హైద్రాబాద్‌కి ప్రధాన ఆదాయ వనరు ఐటీ రంగమే ఇప్పుడు. ఇంతటి ప్రాధాన్యత వున్న రంగాన్ని కేవలం తమ 'హైటెక్‌' పబ్లిసిటీ కోసం చంద్రబాబు, చినబాబు ఉపయోగించుకుంటుండడం శోచనీయం.

Show comments