సూపర్‌ స్టార్‌కి ఇష్టమే కానీ భయం

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి అధికారమంటే ఇష్టమే. అఫ్‌కోర్స్‌, అధికారమంటే ఇష్టపడనివారెవరుంటారు.? కానీ, అందరికీ ఆ అధికారం దక్కేయదు కదా.! జయలలిత మరణానంతరం శశికళకు అధికారం దక్కినం తేలిగ్గా, తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కి అధికారం దక్కకపోవచ్చు. ఎందుకంటే, రజనీకాంత్‌కి అంత ధైర్యం లేదు. కానీ, రజనీకాంత్‌కి అధికారమంటే ఇష్టం. చాలా చిత్రంగా వుంది కదూ, రజనీకాంత్‌ ఆలోచన.? 

రాజకీయాల్లోకి రావాలని రజనీకాంత్‌ ఎప్పటినుంచో అనుకుంటున్నారు.. కానీ, రాలేకపోతున్నారు. తమిళనాడులో రజనీకాంత్‌ అంటే ప్రాణమిచ్చేస్తారు ఆయన అభిమానులు. అదే సమయంలో, తమిళ రాజకీయాలు అంత వీజీ కాదు. అసలు రజనీకాంత్‌ తమిళుడు కాదనీ, ఆయనెలా తమిళ రాజకీయాల్ని శాసించగలుగుతారనీ, రాజకీయాల్లోకి వస్తే రజనీకాంత్‌ని తానే ముందు ప్రశ్నిస్తానని ఆ మధ్య ఓ సినీ నటుడు ప్రశ్నించారు. అతనెవరో కాదు, శరత్‌కుమార్‌. ఈయనా ఓ రాజకీయ పార్టీ పెట్టారుగానీ, అదేమయ్యింది.? అనడక్కండి.. అదంతే. 

రజనీకాంత్‌ని రాజకీయాల్లోకి చాలామంది ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో అయితే సాక్షాత్తూ నరేంద్రమోడీ, బీజేపీలోకి రజనీకాంత్‌ని ఆహ్వానించినా, ఆయన ససేమిరా అనేశారు. మొదటి నుంచీ రాజకీయాలంటే రజనీకాంత్‌కి ఒకింత అనుమానమే. అందుకే, రాజకీయాల్లోకొచ్చి ఇమేజ్‌ చెడగొట్టుకోవడమెందుకని ఆలోచించి.. రాజకీయాలకు దూరంగా వుంటున్నారాయన. 

ఇప్పుడేమో, అధికారమంటే ఇష్టమంటున్నారు. రజనీకాంత్‌ ఎప్పుడైతే, తనకు అధికారమంటే ఇష్టమని చెప్పారో, అభిమానులు సంబరాలు షురూ చేసేశారు.. రజనీకాంత్‌ కొత్త పార్టీ పెట్టేస్తున్నారనీ, బీజేపీతో కలిసి ఆ పార్టీ పనిచేస్తుందనీ గుసగుసలు గుప్పుమంటున్నాయి. జయలలిత మరణంతో తమిళనాడు రాజకీయాల్లో కొంత గందరగోళం ఏర్పడ్డ మాట వాస్తవం. ఈ టైమ్‌లో రాజకీయాల్లోకి వస్తేనే, రజనీకాంత్‌ 'అధికారం దక్కించుకోగలుగుతారు' అన్న భావన వుంది. దాంతో, ఈసారి రజనీకాంత్‌ తన రాజకీయ రంగ ప్రవేశంపై కీలకమైన ముందడుగు వేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 

చూద్దాం.. రజనీకాంత్‌కి అధికారంపై ఇష్టం ఆయనతో రాజకీయాల వైపు అడుగులేయిస్తుందో, లేదంటే ఆయన భయం రాజకీయాలకు ఆయన్ని దూరంగా వుంచుతుందో.!

Show comments