మెగాస్టార్‌ చిరంజీవి ఎ..క..డా.!

మెగాస్టార్‌ చిరంజీవి తన కొత్త సినిమా షూటింగ్‌ పనుల్లో బిజీగా వున్నారా.? షూటింగ్‌ నుంచి కాస్త 'వెసులుబాటు కల్పించుకుని' ఢిల్లీలో వున్నారా.? ఏమో మరి, ప్రస్తుతానికైతే చిరంజీవి గురించిన ఎలాంటి సమాచారం ఎవరికీ అందడంలేదు. 

విషయమేంటంటే, ఈ రోజు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్‌ బిల్లుపై ఓటింగ్‌ జరగనుంది. మధ్యాహ్నం తర్వాత ఆ బిల్లు ఎపిసోడ్‌కి ఛాన్స్‌ దొరుకుతుంది. కాంగ్రెస్‌ ఇప్పటికే తమ ఎంపీలకు ఈ విషయమై విప్‌ జారీ చేసింది. చిరంజీవి, కాంగ్రెస్‌ ఎంపీనే కదా. సో, ఆయనా ఈ బిల్లుపై మాట్లాడటమో, లేదంటే కేవలం ఓటింగ్‌లో పాల్గొనడమో చెయ్యాల్సి వుంటుంది. 

దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యులు, పలువురు కాంగ్రెస్‌ నేతలు ఢిల్లీలోనే వున్నారు. చిరంజీవి జాడ మాత్రం కన్పించడంలేదు. గతంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా పనిచేశారుగనుక, అప్పట్లో ప్రత్యేక హోదా గురించి చిరంజీవి హడావిడి చేశారు గనుక.. ఇప్పుడు చిరంజీవి ఎక్కడ.? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

వాస్తవానికి ఈ ఎపిసోడ్‌లో చిరంజీవే కీలకంగా వ్యవహరించాలి. ఎందుకంటే, 2014 ఎన్నికల సమయంలో, అంతకు ముందు కూడా చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆయన ఇప్పుడు.. అదీ సరైన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి మొహం చాటేయడం కాస్తంత బాధాకరమైన విషయమే. సినిమాల్లో మళ్ళీ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న చిరంజీవి, తనకెందుకు రాజకీయ వివాదాలు.? అని ఊరుకున్నా కొత్త సమస్యలు వచ్చి పడతాయి. 

అన్నట్టు, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ కూడా ప్రత్యేక హోదా విషయంలో ఇప్పుడు పెదవి విప్పడంలేదు. 'మేం ప్రత్యేక హోదా ఇస్తాం..' అని బీజేపీ చెబితే, 'ప్రత్యేక హోదా కోసం డిమాండ్‌ చేస్తాను..' అని 2014 ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు జనసేన అధిపతి హోదాలో పవన్‌కళ్యాణ్‌. ఆ మధ్య పవన్‌కళ్యాణ్‌ ట్విట్టర్‌ పిట్ట, ప్రత్యేక హోదాపై 'కూత' పెట్టి ఊరుకుంది. మరి, ఇప్పుడు పవన్‌కళ్యాణ్‌, ఈ ఎపిసోడ్‌లో ఎందుకు తన ప్రెజెన్స్‌ చూపించలేకపోతున్నారు.? 

అటు అన్నయ్య.. ఇటు తమ్ముడు.. ఇద్దరూ కలిసి 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు..' అన్నట్లు వ్యవహరించాలనుకుంటున్నారేమో.!

Show comments