దివంగత జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళపై సుప్రీం కోర్టు పిడుగు ఎప్పుడు పడుతుంది? అన్నాడీఎంకేలో ఆమెను వ్యతిరేకించేవారిని, డీఎంకే సహా ఇతర ప్రతిపక్షాలను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న.
జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెతో సహా శశికళ, మరికొందరు నిందితులనే సంగతి తెలిసిందే. బెంగళూరులోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వీరికి శిక్ష పడగా, కర్నాటక హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో కర్నాటక ప్రభుత్వం, మరికొందరు సుప్రీం కోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ పూర్తయింది. ఈ ఏడాది జూన్ ఏడో తేదీ వాదనలు పూర్తయ్యాక న్యాయస్థానం తీర్పును రిజర్వులో పెట్టింది. అంటే ఇప్పటికి సుమారుగా ఏడు నెలలైంది. జయలలిత, శశికళ తదితరులను దోషులుగానో, నిర్దోషులుగానో తేల్చాల్సిన సుప్రీం కోర్టు ఇన్ని నెలలైనా తుది తీర్పు ఎందుకివ్వలేదో తెలియదు. ఆ తీర్పు రాకుండానే జయలలిత కన్ను మూయడంతో కర్నాటక హైకోర్టు తీర్పు ప్రకారం ఆమె నిర్దోషిగానే మిగిలిపోయింది. ఇక మిగిలినవాళ్ల విషయం తేలాల్సివుంది.
జయలలిత మరణించారు కాబట్టి ఇక ఈ కేసు కాలగర్భంలో కలిసిపోయినట్లేనని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. అక్రమాస్తుల కేసులో 'అమ్మ' ప్రధాన నిందితురాలు కాబట్టి ఈ అభిప్రాయం కలుగుతోంది. కొందరు అన్నాడీఎంకే నాయకులు కూడా నిశ్చితంగా ఉన్నారేమో...! కాని ఏదో ఒక సమయంలో సుప్రీం కోర్టు తీర్పు రావొచ్చు. ఎందుకంటే కర్నాటక ప్రభుత్వం ఈ కేసు విషయంలో పట్టుదలగా ఉంది. జయలలిత చనిపోయారు కాబట్టి ఈ కేసును మూసేయకూడదని, తుది తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేయాలని సిద్ధరామయ్య సర్కారు నిర్ణయించింది. ఇది చాలా కీలకమైన కేసని కర్నాటక న్యాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కేసులో కర్నాటక ప్రభుత్వం కక్షిదారు (పిటిషనర్) కాబట్టి సుప్రీం కోర్టు తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. శశికళకు రాబోయే కష్టాల్లో ఇదొకటి. ఇక మరో కష్టం ఐటీ దాడుల భయం.
తమిళనాడులో కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు, ఆయన కుమారుడు, ఇంకా కొంతమందిపై జరిగిన ఐటీ శాఖ దాడుల్లో కోట్ల రూపాయలు, విలువైన ఆస్తులు బయటపడ్డాయి. తరువాతి టార్గెట్ శశికళేనని మీడియాలో వార్తలొచ్చాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి, ముఖ్యమంత్రి పదవి తీసుకున్నా ఇన్‌కమ్ ట్యాక్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు జరుగుతాయని ఢిల్లీ నుంచి పోయస్‌గార్డెన్‌కు హెచ్చరికలు వచ్చినట్లు మీడియా సమాచారం. ప్రస్తుతం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించింది. పార్టీ సమావేశం ఈమేరకు తీర్మానించి చిన్నమ్మ నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి పదవి తీసుకుంటుందా, లేదా అనేది త్వరలోనే తేలుతుంది. ఇక శశికళకు మరో ముప్పు పొంచి ఉంది. ఆమె న్యాయస్థానం గడప తొక్కాల్సిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పొచ్చు. జయలలిత మరణం పెద్ద మిస్టరీగా మారిన సంగతి తెలిసిందే.
మద్రాసు హైకోర్టులో, సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. జయ మరణం వెనక ఉన్న 'అసలు నిజాలు' చెప్పాలని డిమాండ్ చేస్తూ కొందరు పిటిషన్లు వేశారు. న్యాయస్థానాలు వీటిని విచారణకు స్వీకరించాయి. 'జయలలిత మృతదేహానికి రీపోస్టుమార్టం ఎందుకు కేయకూడదు?'...అని మద్రాసు హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడాన్నిబట్టే ఈ కేసు తీవ్రత ఏమిటో అర్థమవుతోంది. జయ మరణంపై తనకూ అనుమానాలున్నాయని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటినుంచి చనిపోయేవరకు ఉన్న రహస్యాలు అన్నీ ఇన్నీ కాదు. అవన్నీ ప్రజలకు తెలియాల్సివుంది. ఈ కేసులో ప్రధాన వ్యక్తి శశికళ. కేసు విచారణ సీరియస్‌గా ప్రారంభమైతే శశికళ కోర్టుకు హాజరై అన్ని విషయాలు తెలియచేయాల్సివుంటుంది. కాబట్టి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయ్యానని, రేపో మాపో ముఖ్యమంత్రి అవుతానని చిన్నమ్మ సంతోషించాల్సిన పనిలేదు. భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు చుట్టుముడతాయో ఆలోచంచుకోవాలి.