ఈ రాష్ట్రంలో జనం ఎలా ఆలోచించాలో..ఏం ఆలోచించాలో.. ఎటు మొగ్గాలో.. ఎక్కడ తగ్గాలో.. అన్నీ 99శాతం మీడియా శాసిస్తుంది. ఆ మీడియా నంది అంటే నంది.. పంది అంటే పంది. దాదాపు అన్ని తరహాల మీడియాలో తొంభైతొమ్మిది శాతం ఒకే వర్గం చేతిలో వుండడంతో మిగిలిన వాయిస్ వినిపించే పరిస్థితి లేదు. పైగా సాక్షి లాంటి మీడియాను నిర్థాక్షిణ్యంగా అణచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాపులు ఇప్పుడు రిజర్వేషన్ల సాధన, అనంతరం వీలైతే అధికార సాధన దిశగా కదులుతున్నారు. కానీ వారి ఉద్యమ వార్తల కవరేజీ అంతంత మాత్రంగా వుంది. అదే సదరు మీడియా తలుచుకుంటే, ఈస్ట్ వెస్ట్ లోని ఆందోళనలు, నిరసనలు, ఇతరత్రా వ్యవహారాలు అన్నీ పేజీలకు పేజీలు ఆక్రమించి, హల్ చల్ చేసేవి.
ఇప్పుడు ఇదే కాపు నాయకులను ఆలోచింప చేస్తోంది. తమకు అంటూ ఓ మీడియా వుండకపోతే, ఉద్యమసాధన, అధికార సాధన అసాధ్యం అన్న అనుమానం కలుగుతోంది. గతంలో దాసరి నారాయణ రావు ఉదయం దినపత్రిక నిర్వహించారు. కానీ కష్టసాధ్యమై అమ్మేసారు. ఆ తరువాత చాలా సార్లు దాన్ని మళ్లీ రివైవ్ చేస్తా అంటూ ప్రకటించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు. బొత్స సత్యనారాయణ ఓ ఛానెల్ ను లీజ్ కు తీసుకుని నిర్వహించారు కానీ, తరువాత ఆయనా చేతులు ఎత్తేసారు.
ఇక చిరంజీవికి ఎప్పటి నుంచో న్యూస్ ఛానెల్ తేవాలన్న కోరిక వుంది. అది అలా ఆలోచనల్లోనే మిగిలింది. ఇప్పుడు కాపు ఉద్యమ వార్తలను నొక్కిపెడుతున్న నేపథ్యంలో కాపు సెలబ్రిటీలు, నాయకుల్లో మరోసారి ఈ మేరకు ఆలోచన మొలకెత్తినట్లు తెలుస్తోంది. నిన్నటికి నిన్న హయాత్ లో పిచ్చాపాటీగా జరిగిన చర్చల్లో కూడా ఈ అంశం దొర్లినట్లు తెలుస్తోంది.
న్యూస్ చానెల్ లేదా ప్రింట్ మీడియా ఏదయినా, నిర్వహణ ఏదీ అంత సులవుగా లేదు. అందువల్ల ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. సాక్షి కి తోడుగా మరో మీడియా వుండడం అవసరం అన్న అభిప్రాయాన్ని కాపు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇది ఎవరికి సాధ్యం అవుతుందన్నదే పాయింట్. ధైర్యం చేయగలిగితే పెద్ద కష్టం కాదు.