రైతే రాజు.. ఇదీ చంద్రమాయ.!

ఎకరం భూమిని లాక్కుని.. గజాల లెక్కన కొలిచి కొంత భూమిని ఇస్తారట. అంతే, ఆ 1250 గజాల భూమితోనే ఆ రైతు రాజుగా మారిపోతాడట. ఎలగలెలగ.? అని క్వశ్చన్‌ చేశారో, మీరు అభివృద్ధికి ఆటంకం కలిగించినవారవుతారు. ఎందుకంటే, ఇది చంద్రబాబు జమానా.! 

ప్రభుత్వ అవసరాల కోసం భూముల్ని సేకరించడం ఇప్పుడు కొత్తగా జరుగుతున్న తంతు ఏమీ కాదు. కానీ, అక్కడికేదో జనాన్ని ఉద్ధరించేస్తున్నామంటూ పచ్చని పంట పొలాల్ని లాక్కోవడంతోనే ఇంత చర్చ జరుగుతోంది మరి.! ఒకటి కాదు, రెండు కాదు.. వంద కాదు, వెయ్యి కాదు.. దాదాపు లక్షన్నర ఎకరాల భూమిని రాజధాని కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'సేకరించనుంది'. ఇందులో సుమారు 34 వేల ఎకరాల భూముల్ని రైతుల నుంచి ఇప్పటికే సమీకరణ పేరుతో లాక్కుంది. ముందు ముందు విడతల వారీగా మిగతా భూమిని సొంతం చేసుకోనుంది ప్రభుత్వం. 

వాస్తవానికి రైతుల నుంచి భూముల్ని లాక్కున్నది నిన్న కాదు మొన్న కాదు. లాక్కుని చాలా కాలమే అయ్యింది. అప్పటినుంచి, ఇప్పటిదాకా.. గడచిన ఏడాదిలో ఇంతవరకు ఒక్కటంటే ఒక్కటి కూడా రాజధాని పేరుతో నిర్మాణాల్ని మొదలు పెట్టింది లేదు. తాత్కాలిక సచివాలయం ఒక్కటీ ప్రారంభమయినా, అది ప్రస్తుతానికైతే రాజధాని నిర్మాణం కిందకి రాదని స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబే సెలవిచ్చారు. 

ఇంకేముంది, సోమవారం నేలపాడు రైతులకి ప్లాట్ల కేటాయింపు చేసేస్తున్నాం.. అంటూ ఆర్భాటంగా ప్రకటించేసుకుంది ప్రభుత్వం. టీడీపీ అనుకూల మీడియా ఊరుకుంటుందా.? భజన షురూ చేసింది. రైతుని రాజుగా మార్చే రోజు రానే వచ్చిందంటూ పెద్ద పెద్ద కథనాలతో హోరెత్తించింది. రైతులూ ఉత్కంఠగా ఎదురుచూశారు. ప్లాట్ల కేటాయింపుపై స్పష్టత వస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని కోసం భూములిచ్చిన తమకు ప్లాట్లు రావడం ఆనందంగా వుందన్నారు. అంతలోనే, వారి నెత్తిన పిడుగులాంటి వార్త. ప్లాట్ల కేటాయింపు వ్యవహారం వాయిదా పడిందన్నదే ఆ వార్త. 

'కుంటి సాకు' ఏంటో తెలుసా.? వర్షాలు పడుతున్నాయట. అదిరిందయ్యా చంద్రం.! బహుశా ఆంతకన్నా కుంటి సాకు ఇంకేమీ వుండకపోవచ్చేమో కదా.? బహుశా ఇలాంటి కుంటి సాకులు చంద్రబాబు సర్కార్‌ మాత్రమే చెప్పగలదేమో.?

Show comments