‘నేను విదేశాలు తిరుగుతూ, కష్టపడుతూ, చాకిరీ చేస్తున్నాను పరిశ్రమల కోసం..మరి మీరేం చేస్తున్నారు..ఏం తెచ్చారు..ఏం వచ్చాయి అసలు’ ఇంచు మించు ఇలాంటి మాటలతో నిలదీసారట చంద్రబాబు నాయుడుప పరిశ్రమల శాఖ ఉన్నతాధికారి సాల్మన్ ఆరోగ్య రాజ్ ను. ఇప్పటికి కొన్ని పరిశ్రమలు వచ్చాయని చీఫ్ సెక్రటరీ చెప్పబోతే, తనకు వాస్తవాలు కావాలని, కచ్చితంగా ఏం వచ్చాయో, ఏం తెచ్చారో చెప్పాలని అన్నారట చంద్రబాబు.
బాగానే వుంది. కానీ ఒక్కటే అనుమానం. గడచిన రెండేళ్ల కాలంలో బాబు అనుకూల దినపత్రికలు తీస్తే, రోజూనో, రోజు విడిచి రోజూనో, లేదూ, బాబు చైనా, జపాన్, సింగపూర్, మలేషియా ఇలా నానా దేశాలు తిరిగినప్పుడల్లానో, ఫ్రంట్ పేజీల నిండా వేలు లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమల వార్తలే. ఆ పరిశ్రమ, ఈ సంస్థ, అన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్లు. ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఆ వార్తలు అన్నీ నిజాలే అనుకుంటే ఈ పాటికి ఆంధ్రలో ఊళ్ల కన్నా పరిశ్రమలే ఎక్కువ వుండాలి. ఉద్యోగాలు లేక కాదు, ఉద్యోగస్తులు లేక పరిశ్రమలు అల్లల్లాడిపోతూ వుండాలి.
కానీ మరి బాబుగారు చూస్తే ఇలా అసహనంతో అధికారుల మీద మండిపోతున్నారు. ఏం తెచ్చారు..ఏం వచ్చాయి? అని అడుగుతున్నారు. అంటే ఏమీ రాలేదా? ఏమీ తేలేదా? మరి బాబు అనుకూల మీడియా రాతలన్నీ ఏమిటన్నట్లు? సమాధానం చెప్పాల్సింది అధికారులు కాదు, అలా ఫ్రంట్ పేజీల్లో వైకుంఠం చూపిన బాబు అనుకూల మీడియానే.