అయ్యోపాపం.. వెంకయ్యకి ఎంత కష్టమొచ్చిందో

ఉప రాష్ట్రపతి పదవికి వున్న గౌరవమే వేరు. కానీ, పవర్‌ వుండదు కదా.! సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో వున్న వెంకయ్యనాయుడికి కేంద్ర మంత్రి పదవికి వుండే పవర్‌ ఏంటో, ఉపరాష్ట్రపతికి వుండే గౌరవమేంటో తెలియకుండా వుంటుందా.? అందుకే, ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వచ్చాక, కేంద్ర మంత్రి పదవికి గుడ్‌ బై చెప్పే క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 'వద్దు మొర్రో..' అంటూ వేడుకున్నా వదల్లేదు. ప్రధాని నరేంద్రమోడీ, స్వయంగా వెంకయ్యనాయుడి చేత బీజేపీకీ, కేంద్ర మంత్రి పదవికీ రాజీనామా చేయించారు.. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు. 

'ఉపరాష్ట్రపతి పదవిపై నాకు ఆసక్తి లేదు..' అన్న నోటితోనే, 'అయిష్టంగా ఈ పదవి తీసుకోవాల్సి వస్తోందన్న వార్తల్లో నిజం లేదు..' అని వెంకయ్య చెప్పుకోవాల్సి వస్తోంది. తప్పదు మరి, అక్కడ పొలిటికల్‌ డైనోసార్‌ ఒత్తిడి అలా వుంది మరి.! తాజాగా, వెంకయ్యనాయుడికి హైద్రాబాద్‌లో 'ఆత్మీయ స్వాగతం' లభించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి హైద్రాబాద్‌ వచ్చిన వెంకయ్యను, వివిధ పార్టీలకు చెందిన నేతలు ప్రశంసలతో ముంచెత్తేశారు. 

'నేనెప్పుడూ పదవులు కోరుకోలేదు.. అలాగని పదవులు వద్దనుకోలేదు..' అంటూనే అసలు విషయాన్ని చెప్పకనే చెప్పేశారు. బీజేపీని వీడే విషయంలోనూ, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే విషయంలోనూ తానెంత మానసిక సంఘర్షణకు గురయ్యిందీ ఇంకోసారి వెంకయ్య ఏకరువు పెట్టారు. 'ఇంకొన్నాళ్ళు నేను కేంద్ర మంత్రిగా వుండి వుంటే తెలుగు రాష్ట్రాలకు ఇంకాస్త మేలు కలిగి వుండేది..' అంటూ వెంకయ్య చెప్పుకొచ్చారు. 

తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ముందుకు నడవాలనీ, ముఖ్యమంత్రులిద్దరూ స్నేహపూర్వకంగా వుండాలనీ వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. మొత్తమ్మీద, వెంకయ్య ఇంకా 'ఆ బాధని' మర్చిపోలేకపోతున్నారన్నమాట. కురువృద్ధుడు.. అన్న కారణంగా అద్వానీ సహా పలువురు ప్రముఖుల్ని పదవులకు దూరం పెట్టిన నరేంద్రమోడీ, వెంకయ్యనాయుడిని ఇదిగో ఇలా దెబ్బకొట్టారన్నమాట. తప్పనిసరి పరిస్థితుల్లో వెంకయ్య 'ప్రమోషన్‌'గా ఈ కొత్త బాధ్యతల్ని ఫీలవుతున్నారు. తప్పదు మరి.!

Show comments