తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, సినిమా షూటింగ్ ప్రారంభించడం, పూర్తి చేయడం, అమెరికా వెళ్ళిపోవడం.. ఇదంతా ఓ ఆనవాయితీగా పెట్టుకున్నట్టున్నారు. కాదు కాదు, ఆరోగ్యం సహకరించకపోవడంతో, ఆయన కొన్నాళ్ళు ఇండియాలో, ఇంకొన్నాళ్ళు అమెరికాలో వుండక తప్పడంలేదు. అదీ కాదు, వైద్య పరీక్షల నిమిత్తం, విరివిగా ఆయన అమెరికాకి వెళ్ళి వస్తుండాల్సిందే. ఇంకో మాటకు తావు లేదు. ఇలా రకరకాల అభిప్రాయాలు, వాదనలు, గుసగుసలు.. అభిమానుల్ని టెన్షన్ పెడుతున్నాయి.
తాజాగా మరోమారు రజనీకాంత్ అమెరికా వెళ్ళారు. ఇటీవల 'రోబో 2.0' సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్, నాలుగైదు వారాల పాటు అమెరికాలోనే వుండేలా టూర్‌ని ప్లాన్ చేసుకున్నారట. 'వైద్య పరీక్షల కోసమే' అని రజనీకాంత్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 'కబాలి' సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఇలాగే రజనీకాంత్ చాలా రోజులపాటు అమెరికాలోనే వుండిపోయారు.
'కబాలి' సినిమా ప్రమోషన్‌లో రజనీకాంత్ ఎక్కడా కన్పించలేదు. 'కబాలి' విడుదలయ్యాకే అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చారు రజనీకాంత్. అమెరికాలోనే 'కబాలి' సినిమాని ఆయన చూశారు. మరి, 'రోబో 2.0' విషయంలో కూడా రజనీకాంత్ ఇదే వ్యూహాన్ని అమలు చేస్తాడా.? ఆయనకు వేరే దారి లేదా.? ఇదీ ఇప్పుడు అభిమానుల తాజా టెన్షన్. చాలాకాలంగా రజనీకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలా ఓసారి విదేశాల్లో వైద్య చికిత్స చేయించుకోవడంతో ఆరోగ్యం కొంచెం కుదుటపడినా, 'కబాలి' టైమ్‌లో కొంచెం ఇబ్బంది పెట్టింది. మళ్ళీ వైద్య పరీక్షలు, వైద్య చికిత్స తప్పలేదు.
నిజానికి 'కబాలి' టైమ్‌లో రజనీకాంత్ అనారోగ్యానికి గురైంది కూడా 'రోబో 2.0' సినిమా షూటింగ్ కారణంగానేనట. ఆ కాస్ట్యూమ్స్, ఆ హెవీనెస్.. ఇవన్నీ రజనీకాంత్ ఆరోగ్యాన్ని చెడగొట్టాయన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం. సినిమా కోసం ప్రాణం పెట్టే రజనీకాంత్, 'రోబో 2.0' పూర్తి చేయడం కోసమే, అమెరికాలో రెండు నెలలపాటు వైద్య చికిత్స తీసుకుని వచ్చారనీ, మిగిలిన చికిత్సను ఇప్పుడు పూర్తి చేయబోతున్నారనీ తెలుస్తోంది.