'ఖైదీ' కోసం పోటెత్తిన జనసంద్రం.!

కాస్సేపట్లో 'ఖైదీ నెంబర్‌ 150' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌ కోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా (పవన్‌కళ్యాణ్‌ తప్ప) విజయవాడకు చేరుకుంది. పలువురు సినీ ప్రముఖులూ ఈ ఈవెంట్‌కి హాజరవుతున్నారు. అమరావతి ప్రాంతంలోని హాయ్‌ల్యాండ్‌లో ఈ ఈవెంట్‌ జరుగుతోంది. దాదాపుగా రావాల్సినవారంతా హాయ్‌లాండ్‌కి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోపక్క, అభిమానులు మద్యాహ్నం 12 గంటల సమయం నుంచే ఈ ప్రాంగణానికి పోటెత్తారు. 

మీడియా గ్యాలరీ, వీవీఐపీ గ్యాలరీ.. ఇలా గ్యాలరీలుగా 'ఖైదీ' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ప్రాంగణాన్ని డివైడ్‌ చేసి, డిజైన్‌ చేశారుగానీ.. ప్రాంగణంలోకి అభిమానుల ఎంట్రీకి గేట్లు తెరవడం మొదలయ్యాక.. అంతా కలగాపులగం అయిపోయింది. ఈవెంట్‌ ప్రారంభమవడానికి గంట ముందే అభిమానులు దాదాపు అన్ని గ్యాలరీల్లోనూ ప్రత్యక్షమయ్యేసరికి నిర్వాహకులకు మైండ్‌ బ్లాంక్‌ అయ్యింది. 

స్టేజ్‌ మీద అల్లు అరవింద్‌ హడావిడి హడావిడిగా తిరిగేశారు. అటు ప్రైవేట్‌ సెక్యూరిటీ (బౌన్సర్లు, కొందరు అభిమానులు), ఇటు పోలీసులతోనూ అల్లు అరవింద్‌ మంతనాలు జరిపారు. అభిమానుల్ని ఉద్దేశించి ఇంకో వైపునుంచి 'జాగ్రత్త సూచనలు' కూడా జరుగుతున్నాయి. ప్రాంగణం చిన్నది కావడం.. వచ్చే అభిమానుల సంఖ్య ఎక్కువ కావడంతో.. పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే తయారయ్యింది. దాంతో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొందరు అభిమానులే, మిగతా అభిమానుల్ని కంట్రోల్‌ చేయాల్సి వస్తోంది. 

ఇదిలా వుంటే, ప్రాంగణంలో 'మెగాస్టార్‌, మెగా పవర్‌స్టార్‌' నినాదాలకన్నా, 'పవర్‌స్టార్‌..' నినాదాలే చాలా ఎక్కువగా విన్పిస్తుండడం గమనార్హం. సోషల్‌ మీడియాలో ఇప్పటికే అన్నయ్య సినిమా సక్సెస్‌ కావాలని పవన్‌కళ్యాణ్‌ ట్వీటేసినా, ఆయన ప్రత్యక్షంగా సభకు హాజరుకాకపోతే పవర్‌ స్టార్‌ అభిమానుల నుంచి గందరగోళం తప్పేలా కన్పించడంలేదు.

Show comments