చట్టబద్ధత.. వాట్‌ ఏ నాన్సెన్స్‌.!

పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం ఓ పక్క హాట్‌ హాట్‌గా తెరపైకొస్తే, ఇంకోపక్క ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని తెరపైకి తెచ్చింది అధికార తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా డిమాండ్‌ని కాంగ్రెస్‌, వైఎస్సార్సీపీ విన్పిస్తున్నాయి. టీడీపీ మాత్రం, ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అంటోంది. తమ ముందున్న లక్ష్యం, ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడమేనన్నది టీడీపీ వాదన. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఇదే విషయాన్ని స్పష్టం చేసేశారు తాజాగా. 

అయితే, ఇంకోపక్క కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం గురించి మాట్లాడుతూ, అదసలు ప్యాకేజీనే కాదు, అది ప్రత్యేక సాయం.. అంటూ సెలవిచ్చారు. ప్యాకేజీనో, సాయమో.. దీని విలువ అయితే రెండు లక్షల పాతిక వేల కోట్లని గతంలో వెంకయ్యనాయుడే చెప్పుకొచ్చారు. పేరేదైతేనేం, దానికి చట్టబద్ధత అంటూ కావాలి కదా.! ఈ చట్టబద్ధతపై గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ క్లారిటీ ఇచ్చారు. కేంద్రమంత్రిగా తాను చేసిన ప్రకటనకి చట్టబద్ధత వుంటుందనీ, కొత్తగా చట్టబద్ధత అన్న ప్రశ్నే తలెత్తదని చెప్పుకొచ్చారాయన. 

మరి, పార్లమెంటు సమావేశాల్లో టీడీపీ చట్టబద్ధత కోసం పట్టుబట్టి ఉపయోగమేంటట.? ఇప్పటికే పలుమార్లు కేంద్ర క్యాబినెట్‌ భేటీ అయ్యింది. ప్రత్యేక ప్యాకేజీనో, సాయమో.. పేరేదైతేనేం.. ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తామని చెప్పిన నిధుల లెక్క 2 లక్షల 25 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారానికి ఏదో ఒక క్యాబినెట్‌ భేటీలో చట్టబద్ధత కల్పించేసి వుండాలి. అలా జరగలేదంటే, ఇదంతా హంబక్‌.. అనే అర్థం చేసుకోవాలి. 

కాస్త లోతుగా ఆలోచిస్తే, కేంద్రం లెక్క గట్టిన 2 లక్షల 25 వేల కోట్ల రూపాయల ప్రత్యేక సాయంలో పోలవరం ప్రాజెక్టు వుంది.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో చేపట్టే రహదారి ప్రాజెక్టుల్లానే ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టే రహదారి ప్రాజెక్టులకు సంబంధించిన నిథుల లెక్కా వుంది. ఇంకా చాలా చాలానే వున్నాయి. ఇవేవీ, ప్రత్యేక ప్యాకేజీ అంశం పరిధిలోకి రావు. అందుకే, తెలివిగా.. 'ప్రత్యేక సాయం..' అంటూ కేంద్రం కహానీలు చెబుతోంటే, దానికి టీడీపీ వంత పాడుతోంది. 

టీడీపీ లొల్లి నేపథ్యంలో, ప్రత్యేక సాయానికి చట్టబద్ధత పేరుతో కేంద్రం ఈ పార్లమెంటు సమావేశాల్లో హడావిడి చేసేసినా చేసెయ్యొచ్చు. లేదంటే, టీడీపీని లెక్కల్లోకి తీసుకోనూపోవచ్చు. ఏమో, ఏం జరుగుతుందోగానీ, 'హోదా'ని గాలికొదిలేసి, కేంద్రం దగ్గర సాగిలాపడి, 'సాయం' అంటూ దేబిరించాల్సిన దుస్థితి.! వారెవ్వా అదిరిందయ్యా చంద్రబాబూ.!

Show comments