తమిళనాడు అధికారం.. డీఎంకే చేతుల్లోకే?

శశికళ విసిరిన రెండో పాచిక కు కూడా ఎలాగైనా అడ్డు పడాలని పన్నీరు వర్గం భావిస్తోంది. తనను దించిన శశికళ వర్గంలోని వారెవరూ సీఎం పీఠంపై కూర్చోవడానికి పన్నీరు వర్గం ఇష్టపడటం లేదు. అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని పన్నీరుకు ఆరాటం ఉంది కానీ.. ఆ స్థాయి బలం లేదు. శశికి శిక్ష ఖరారు అయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలు పరుగులెత్తి వచ్చిన పరిస్థితి కనిపించడం లేదు! ఇప్పటికీ పన్నీరు స్కోరు 11 మంది ఎమ్మెల్యేలు, అంతే స్థాయిలో ఎంపీలు!

ఇక పళని స్వామి వర్గం కూడా పన్నీరును లక్ష్యంగా చేసుకుంది. అయితే ఈ వర్గానికైనా గవర్నర్ మద్దతు లభిస్తుందా? అనేది ప్రశ్నార్థకం. కొంతమంది ఎమ్మెల్యేలు చేజారే అవకాశాలైతే ఉన్నాయి. ప్రత్యేకించి పన్నీరు సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేల స్వామి దగ్గర నుంచి జారి పోయే అవకాశాలున్నాయి. మెజారిటీకి ఒక్క ఎమ్మెల్యే తక్కువగా ఉన్నా.. ప్రభుత్వం నిలబడదు కాబట్టి.. స్వామికి అవకాశం దొరికినా, ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం, ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం లేదు!

ఏతా వాతా.. అన్నాడీఎంకే పూర్తిగా బలహీన పడింది! జయలలిత మరణించిన కొన్ని నెలల్లో.. శశికళ కు శిక్ష ఖరారు అయిన కొన్ని గంటల్లోనే.. అన్నాడీఎంకే వీక్ అయిపోయింది! ఎంజీఆర్ స్థాపించిన ఈ పార్టీ అంతర్గత కలహాలతో ముప్పుతిప్పలు పడుతోంది!

ఈ నేపథ్యంలో డీఎంకే కూడా వేగంగానే పావులు కదుపుతోందని సమాచారం. పన్నీరు, పళనిస్వామిలు వర్గాలుగా మారి ఒకరిపై మరొకరు కత్తులు నూరుకుంటున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలని డీఎంకే భావిస్తోంది. అయితే పన్నీరు మద్దతు తీసుకుని, కాకపోతే.. స్వామి క్యాంప్ లోని ఎమ్మెల్యేలను చీల్చుకుని వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకునే దిశగా డీఎంకే  పావులు కదుపుతోందని సమాచారం!

అయితే.. ఎటొచ్చీ డీఎంకేకు గవర్నరు, కేంద్ర ప్రభుత్వమే అడ్డు. తమిళనాడు పార్టీలు ఏమైనా చేయగలవు, ఏ కూటమిలో అయినా ఇమడగలవు.. బీజేపీని మచ్చిక చేసుకోగలిగితే.. స్టాలిన్ తాపీగా సీఎం అయిపోగలడు! రాజ్యాంగం.. విలువలు.. అంటారా, వాటికి నిజంగానే విలువ ఉందా? తమిళనాడు పరిణామాలను గమనిస్తున్న వారెవరైనా రాజ్యాంగంపై నమ్మకం ఉంచగలరా? 

Show comments