డబ్బుకీ మతానికీ లింకేంటి.?

దేశంలో 125 కోట్లమంది భారతీయులూ కరెన్సీ సంక్షోభంతో దిక్కు తోచక విలవిల్లాడుతున్నారు. సోకాల్డ్‌ నల్ల కుబేరులు మాత్రం హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. ఒకరిద్దరు ఐటీ దాడుల్లో పట్టుబడ్తున్నా, ఓవరాల్‌గా నల్ల కుబేరులంతా సేఫ్‌. గడచిన 30 రోజులుగా బ్యాంకు క్యూలైన్లలో తల్లడిల్లిపోతున్నది సామాన్యులు మాత్రమే. ఇక్కడ రాజకీయ నాయకులు కన్పించరు, నల్ల కుబేరులు కన్పించరు. బ్యాంకులకు వున్న దొడ్డిదార్లు, పొలిటికల్‌ పవర్‌.. వీటన్నిటినీ ఉపయోగించి అటు రాజకీయ నాయకులు, ఇటు రాజకీయ నాయకులు ఎప్పుడో సేఫ్‌ జోన్‌లోకి వెళ్ళిపోయారు. 

ఇక్కడ, 125 కోట్ల మంది భారతీయుల్లో రాజకీయ నాయకులుగానీ, నల్ల కుబేరులుగానీ లేరు. ఈ 125 కోట్ల మంది భారతీయుల్లో కులమతాలకతీతంగా సామాన్యులే వున్నారు. బ్యాంకుల ముందు క్యూ లైన్లలో హిందువులే వున్నారనీ, ముస్లింలకు చోటు దక్కడంలేదనీ అంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటుండదు. కానీ, ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం, పెద్ద పాత నోట్ల రద్దుతో మైనార్టీలు విలవిల్లాడుతున్నారనీ, వారు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో బ్యాంకులు సరిగ్గా పనిచేయడంలేదనీ, ఇది నరేంద్రమోడీ ప్రభుత్వ కుట్ర అనీ సంచలన ఆరోపణలు చేశారు. క్యూ లైన్లలో విలవిల్లాడుతున్నవారంతా భవిష్యత్తులో నరేంద్రమోడీకి చుక్కలు చూపిస్తారనీ సెలవిచ్చారాయన. 

ఒక్కటి మాత్రం నిజం.. క్యూ లైన్లలో ఇబ్బందులు పడ్తున్నవారు కేంద్ర ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. పెద్ద పాత నోట్ల రద్దుతో దేశం ఉద్ధరింపబడ్తుందన్న నమ్మకాలు రానురాను సన్నగిల్లుతున్నాయి. ఒక్కటంటే ఒక్క రెండు వేల రూపాయల నోటు కోసం నాలుగైదు గంటలు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది సామాన్యులకి. అదే నల్ల కుబేరులకు మాత్రం కట్టలకు కట్టలు పెద్ద కొత్త నోట్లు దొరికేస్తున్నాయి. 

క్యూ లైన్లలో ఇబ్బందులు పడ్తున్న సామాన్యులకి ఎలాగైతే కుల మతాలతో సంబంధం లేదో, అక్కడ కోట్లు వెనకేసుకుంటోన్న నల్ల కుబేరులు, రాజకీయ నాయకులకీ కులమతాలతో సంబంధం లేదు. ఇట్‌ హ్యాపెన్స్‌ ఓన్లీ ఇన్‌ ఇండియా. ఈ విషయాన్ని ఒవైసీ సాబ్‌ మర్చిపోతే ఎలా.? 'పాకిస్తాన్‌ పది ముక్కలవుతుంది జాగ్రత్త..' అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నిన్న చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, ఒవైసీ ఇలా 'మైనార్టీ' కార్డుని తెరపైకి తెచ్చారా.? లేదంటే, నిజంగానే క్యూ లైన్లలో ఇబ్బందులు పడ్తున్న మైనార్టీల మీద ఆయనకు మమకారం ఎక్కువైందా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి. Readmore!

Show comments