రీమేక్‌.. ఆలస్యమైనా ఫర్వాలేదా..?!

ఇది సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యుగం.. ప్రపంచీకరణ, ప్రపంచమే ఇప్పుడు ఒక కుగ్రామం.. ఈ మార్పులు సినిమాకు కూడా వర్తిస్తాయి. సినిమా బాగుంది అనే టాక్‌ వచ్చిందంటే.. అది ఏ భాష సినిమా అనేది అనవసరం, నిజంగా మంచి సినిమాలు చూడాలనే అభిలాష ఉన్న వాళ్లు ఇంటర్నెట్‌ను మాధ్యమంగా చేసుకుని వెదుక్కొని చూసేస్తున్నారు! వీడియో క్యాసెట్లు, సీడీ-డీవీడీల యుగంలోనే.. ఎక్కడో హిట్టైన సినిమాల ప్రింట్‌లను తెచ్చి చూసుకోవడం మొదలైంది. ఈ తరహా అభిరుచి ఉన్న వాళ్లు దశాబ్దాల నుంచే ఉన్నారు అంతటా. అయితే సోషల్‌ మీడియా, యూట్యూబ్‌, ఇతర మూవీ బ్యాంక్‌ వెబ్‌సైట్లు.. వీటి పుణ్యమా అని ఎంత అరుదైన సినిమాను సంపాదించుకోవడానికి కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది!

ఓవరాల్‌గా ఆంగ్లంతో మొదలుకుని.. ఇతర ప్రపంచ దేశాల, భారతీయ భాషల సినిమాలను చూడటం బాగా పెరిగింది. ఈ విషయంలో తెలుగువాళ్లు చాలా ముందున్నారు కూడా! ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకుంటే.. మన వాళ్ల రీమేక్‌ పాట్లను చూసి తెలుగు వాళ్ల తీరును ఒకసారి ప్రస్తావించాల్సి వస్తోంది. పొరుగింటి పుల్లకూరు రుచి ఎక్కువ.. తెలుగులో ఉన్న నానుడి. తెలుగు వారికి బాగా వర్తించే నానుడి. మంచి సినిమాలను చూసే ఉద్దేశంతో పక్కభాషల సినిమాలను చూసే ప్రేక్షకులకు ఈ నానుడి వర్తించదు కానీ, సినిమాలు తీయడానికి 'రీమేక్‌' అనే ప్రక్రియ మీద ఆధారపడే సినిమా వాళ్లకు మాత్రం ఈ నానుడి వందశాతం వర్తిస్తుంది!

తెలుగునాట ఈ మధ్య కాలంలో వస్తున్న రీమేక్‌లలో 'రీమేక్‌' చేయగల విషయం ఉన్న సినిమాలు కొన్ని మాత్రమే, 'ప్రేమమ్‌', 'ఊపిరి' వంటి కొన్ని సినిమాలను పక్కన పెడితే.. మిగిలిన సినిమాల్లో మరీ రీమేక్‌ చేయాల్సినంత సత్తా ఏమీ లేదనే చెప్పాలి. చేస్తే చేశారు, సొంతంగా కథలను తెచ్చుకోలేని, తయారు చేయించుకోలేని, రచయితలను ఆ మేరకు ప్రోత్సహించుకోలేని హీరోలు.. పరాయి భాషల్లో వస్తున్న సినిమాలను రీమేక్‌ చేస్తూ కాలం గడుపవచ్చు గాక, కానీ ఆ రీమేక్‌లు కూడా మరీ లేట్‌ అయిపోతూ ఉంటే, పక్కభాషల్లో రెండు మూడేళ్ల కిందట వచ్చిన సినిమాలను వేడి వేడిగా కాకుండా.. మరీ చల్లారిపోయాకా అందిస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు!

'కత్తి' సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంటర్నెట్‌లో ఈ సినిమా ప్రింట్‌ సబ్‌ టైటిల్స్‌తో సహా అందుబాటులోకి వచ్చి ఒకకాలం అయిపోయింది. మామూలుగానే తమిళ సినిమాలంటే తెలుగు వాళ్లకు రుచి ఎక్కువ. హిట్టైన తమిళ సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకుని చూసే అలవాటు చాలా మందికే ఉంది. ఇక చిత్తూరు, నెల్లూరు వంటి తమిళనాడు సరిహద్దు జిల్లాల యువతీయువకులకు ఈ తమిళ సినిమాలను చూడటం బాగా అలవాటు కూడా!  ఏతావాతా.. కత్తి కథేంటి, కాన్సెప్టేమిటి.. అనే విషయాలు ముందుగా తెలియడమే కాదు, ఎలాగూ ఆ సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోయాయి కాబట్టి.. 'వేడి' తగ్గిపోతుంది! పదార్థం 'వేడి' తగ్గిపోతే రుచి కూడా తగ్గుతుంది సుమా! అన్నింటికీ మించి మెగాస్టార్‌ రీ ఎంట్రీని ఎలాంటి కథతో చూడబోతున్నాం.. అనే యాంగ్జైటీ మిస్‌ అవుతుంది. అది లేకపోయినా పర్వాలేదు.. అనుకుంటే దానికి ఎవరూ ఏం చెప్పలేరు! Readmore!

ఇక పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ 'కాటమరాయుడు' మరో ప్రహసనం! ఆల్రెడీ డబ్బింగ్‌ అయిన సినిమాను ఆయన రీమేక్‌ చేస్తున్నాడు. ఇది కూడా రెండున్నర సంవత్సరం కిందటి సినిమానే! అజిత్‌ హీరోగా తమిళంలో హిట్టైన ఈ సినిమాను అప్పట్లోనే తెలుగులోకి డబ్‌ కూడా చేశారని వేరే చెప్పనక్కర్లా. 'వీరుడొక్కడే' పేరుతో విడుదలైన ఈ సినిమా ఎవరినీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎందుకంటే.. ఇదొక సాదాసీదా రొటీన్‌ మాస్‌ మసాలా కాబట్టి!

అజిత్‌ గ్రే హెయిర్‌ లుక్‌తో కనిపించి ఆ పాత్రకు జీవం పోయడం తప్పించి, మరీ చమక్‌ లేమీ లేని సినిమా 'వీరమ్‌'. ఈ సినిమా తమిళంలో విడుదలైనప్పుడు రివ్యూయర్లు దీనికి ఫిఫ్టీ పర్సెంట్‌ మార్కులు మాత్రమే వేశారు! అయినప్పటికీ పవన్‌ కల్యాణ్‌కు ఈ సినిమా అంటే నచ్చింది, రీమేక్‌ చేస్తుండవచ్చు. ఇక కావాలనే చేస్తున్నారో, క్యాష్‌ చేసుకోవాలనే చేస్తున్నారో కానీ.. 'వీరమ్‌' తెలుగు వెర్షన్‌ అనగా 'వీరుడొక్కడే'ను టీవీల్లో ప్రసారం చేస్తున్నారు. ఒక ప్రముఖ ఛానల్‌లో ఈ సినిమాను వీలైనప్పుడల్లా ప్రసారం చేస్తున్నారు!

ఒకవైపు ఆ సినిమా తెలుగులో రీమేక్‌ అవుతుండగా.. దాన్ని మాత్రం ఎంచక్కా టీవీలో ప్రసారం చేస్తున్నారు. అలాగే యూట్యూబ్‌లో కూడా 'వీరుడొక్కడే'ను పెట్టేశారు! టీవీల్లో మిస్‌ అయిన వారు యూట్యూబ్‌లో చూసుకోవచ్చనమాట! అజిత్‌ తెలుగు వాళ్ల దష్టిలో మరీ అనామకుడు ఏమీ కాదాయె. అతడి డబ్బింగ్‌ బొమ్మలు ఒక దశలో స్ట్రైట్‌ సినిమాలకు తీసిపోని రీతిలో విడుదల అయ్యాయి. ఆ క్రేజ్‌ ఇప్పుడు లేకపోయినా.. అతడంటే గుర్తింపు మాత్రం పోలేదు. ఇలాంటి నేపథ్యంలో అతడి డబ్బింగ్‌ బొమ్మ ఇలా టీవీల్లో ప్రసారం అవుతూ ఉండగా, యూట్యూబ్‌లో తెలుగు వెర్షన్లోనే అందుబాటులో ఉండగా.. వీటి ప్రభావం 'కాటమరాయుడు'పై ఉండదు అనుకోవడం అమాయకత్వమే! పవన్‌కల్యాణ్‌ వీరాభిమానులను పక్కన పెట్టి చూస్తే.. రెండున్నరేళ్ల కిందట తెలుగులో విడుదల అయిన ఒక సినిమాను పవన్‌కల్యాణ్‌ రీమేక్‌ చేస్తున్నాడంతే! మరీ పాత సినిమాను రీమేక్‌ చేయడం ఒక అందం, పక్క భాషలో వచ్చిన సినిమాను రీమేక్‌ చేయడం మరో అందం! కానీ.. ఇలాంటి సినిమాలను రీమేక్‌ చేయడం మాత్రం ఆశ్చర్యం మాత్రమే!

తెలుగు ఇండస్ట్రీ కథ అటు ఇటుగా కన్నడ ఇండస్ట్రీ మాదిరి తయారైంది. ఎలాగంటే.. కర్ణాటకలో తెలుగు సినిమాలు భారీ స్థాయిలో విడుదల అవుతాయి. పెద్ద హీరోలు, చిన్న హీరోలు తేడా లేకుండా.. అక్కడ మన సినిమాలు విడుదల అవుతాయి. ఏవో కొన్ని జిల్లాలను మినహాయిస్తే.. బెంగళూరు మహానగరంతో సహా చాలా జిల్లాల్లో తెలుగు సినిమాల ఆధిపత్యమే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు హీరోలకు గుర్తింపు, తెలుగు సినిమాలకు వసూళ్లు బాగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ కొందరు హీరోలు విచిత్రాలు చేస్తున్నారక్కడ. ఆ విచిత్రాలేమిటంటే.. తెలుగు సినిమాలను రీమేక్‌ చేయడం!

ఉదాహరణకు 'మిర్చి' పెద్ద హిట్‌. తెలుగు గడ్డ మీదే కాదు, తెలుగు వెర్షనే కర్ణాటకలో కూడా మంచి హిట్‌. అలా హిట్టైన బొమ్మను తదుపరి కాలంలో సుదీప్‌ 'మాణిక్య' పేరుతో రీమేక్‌ చేశాడు. ఆఖరికి కర్ణాటక జనాలు కూడా విస్తుపోయారు! కొత్తగా ఏమీ చేయలేక.. అప్పటికే కన్నడనాట బాగా ఆడిన సినిమాను తిరిగి చేసి చూపించాడు.. జస్ట్‌ పేరడీగా మిగులుతాయి ఆ ప్రయత్నాలు. ఒకటని కాదు.. కన్నడ స్టార్‌ హీరోలు ఇలాంటి సినిమాలే చేసుకొంటూ కూర్చున్నారు. హిందీలో 'ఓ మైగాడ్‌' తెలుగులో 'గోపాలా గోపాలా'గా రూపొంది హిట్టైన సినిమాను మళ్లీ ఉపేంద్ర-సుదీప్‌లు రీమేక్‌ చేశారు. సోషల్‌ మీడియా శకంలో కూడా హీరోలు అక్కడి హీరోలు ఇలాంటి యత్నాలు చేస్తూ.. తమ సినిమాల స్థాయిని తగ్గిస్తున్నారు. అటు ఇటుగా..మన తెలుగు వాళ్ల రీమేక్‌ పాట్లు కూడా అలాగే ఉన్నాయి!

తెలుగు వాళ్ల రీమేక్‌ ముచ్చట్లు ఇంతటితో ఆగిపోలేదు... అప్పుడెప్పుడో హిందీలో వచ్చిన 'స్పెషల్‌ చబ్బీస్‌', 'క్వీన్‌' వంటి సినిమాల రీమేక్‌ ప్రతిపాదనలు ఇంకా ఉన్నాయి! ఆ సినిమాలు వచ్చి ఒక కాలం అయిపోయింది.. వాటిని చూసే ఆసక్తి ఉన్న వారు చూసేశారు. చూడనివారు ఉన్నారు కదా.. వారి కోసం రీమేక్‌ చేయొచ్చు కదా.. అనొచ్చు, కానీ ఇలాంటి ప్రయత్నాలతో నవ్యత కొరవడుతుంది. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి రీచ్‌ అయ్యింది.. అని చెప్పుకుంటూ, ప్రముఖ హీరోలు, టాప్‌ హీరోలు ఇలా రీమేక్‌లు చేసుకొంటూ కూర్చుంటే అది కేవలం ప్రహసనం అవుతుంది.

కన్నడ వాళ్లు తమ భాషలోకి ఇతర భాషల సినిమాలను అనువదించడాన్ని నిషేధించారు. దాని ఫలితంగా అక్కడ హీరోలకు కొత్తదనం కోసం ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎలాగూ అనువాదం ఉండదు కాబట్టి.. తమిళ, తెలుగు భాషల సినిమాను రీమేక్‌ చేసుకొంటూ తమ ఇండస్ట్రీ స్థాయిని దిగజార్చేశారు. ఆఖరికి కర్ణాటకలో కన్నడ సినిమాలను బలవంతంగా ఆడించాల్సిన పరిస్థితికి తెచ్చారు. మల్టీప్లెక్స్‌ల్లో కనీసం ఒక షో అయినా కన్నడ సినిమాను ఆడించాలని ప్రభుత్వం జీవో తెచ్చిందక్కడ! ఎగ్జిబీటర్లలోనూ, ప్రేక్షకుల్లోనూ కన్నడ సినిమాలపై ఆసక్తి పోయిందంటే.. దానికి కారణం అక్కడి హీరోల తీరు, రీమక్‌ల జోరే! కాబట్టి.. 'రీమేక్‌' అనే ప్రక్రియ ఎంత ప్రమాదకరమైనదో అర్థం చేసుకోవచ్చు. సొంత వారిలోనే ఇండస్ట్రీపై గౌరవాన్ని, ఆసక్తిని తగ్గించేస్తుంది. కాబట్టి.. మన హీరోలు.. పాత చింతకాయపచ్చడి సినిమాలను రీమేక్‌లు చేయడం ఆపితే మేలు! లేకపోతే... టాలీవుడ్‌ స్థితి శాండల్‌వుడ్‌లా కాగలదు!

Show comments