రాజకీయ ప్రయోజనంలేని పని ఎందుకు?

ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు దాటిపోయింది. తెలంగాణలో సంబురాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో నవనిర్మాణ దీక్ష పేరుతో ముఖ్యమంత్రి విషాద గాథలు వినిపించారు. విభజన చట్టంలో ఉన్న అంశాల్లో ఇప్పటివరకు అనేకం అమలు జరగలేదు. అలాంటివాటిల్లో ఉభయ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఒకటి. లా మేకర్స్‌ ఆర్‌ లా బ్రేకర్స్‌ అనే సంగతి తెలిసిందే. చట్టాలు చేసే ప్రభుత్వాలే వాటిని పట్టించుకోవు. అమలు చేయవు.

ఇతర చట్టాల మాదిరిగానే విభజన చట్టం కూడా ఈ కేటగిరీలో చేరిపోయింది. కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద విభజన చట్టం అమలు ఆధారపడి ఉంది. చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదనేది కేంద్రం అభిప్రాయం. చేయకపోయినా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చేసేదేంలేదు. విభజన చట్టంలోని పలు అంశాలకు పంగనామాలు పెడుతున్న కేంద్రం అసెంబ్లీ సీట్ల పెంపునకూ పంగనామాలు పెట్టే ప్రమాదమే కనబడుతోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికలకు మిగిలివున్న రెండేళ్ల సమయంలో పెంపు అమలు జరుగుతుందా? అంటే 'అవును' అని కచ్చితంగా చెప్పలేం.

రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలోని ఇతర అంశాలు అమలు చేయకపోయినా బాధపడరేమోగాని సీట్ల పెంపు విషయంలో మాత్రం ఆందోళన చెందుతున్నారు. కారణం? ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీపడి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీల్లో చేర్పించుకోవడమే. చేరేవారు ఏ ఆశ లేకుండా చేరరు కదా. వీరందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఇంత ధైర్యంగా హామీ ఇవ్వడానికి కారణం కచ్చితంగా సీట్లు పెరుగుతాయనే నమ్మకంతోనే. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతమున్న 119 సీట్లు 153 అవుతాయి. ఆంధ్రాలో ప్రస్తుతమున్న 175 సీట్లు 225 అవుతాయి. ఈ పెంపు జరిగితే ఫిరాయింపుదారులందరికీ టిక్కెట్లు ఇవ్వొచ్చు. కాని జరగకపోతే? దీనికి జవాబు దొరక్కపోవడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు జుట్టు పీక్కుంటున్నారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్‌ గురించి రెండు రకాలుగా మట్లాడినట్లు సీట్లు పెంపుపై కూడా కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు.

సీట్లు పెంచడం గ్యారంటీ అని ఒకరంటే, పెంచడం కుదరదని మరొకరంటారు. పరిశీలనలో ఉందని ఒకరంటే, త్వరలోనే ఆమోదం పొందుతుందని మరొకరంటారు. కొంతకాలం కిందట అసెంబ్లీ సీట్లు పెంచేది లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పార్లమెంటులోనే చెప్పగా, అబ్బే... అలాంటిదేంలేదని, సీట్లు పెరుగుతాయని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. కాని ఇప్పటివరకు మాత్రం అసలు విషయం తెలియడంలేదు. కొంతకాలం కిందట బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రెండు రాష్ట్రాల్లో పర్యటించి వెళ్లిన తరువాతనే సీట్ల పెంపు అంశాన్ని కేంద్రం పక్కన పెట్టిందని సమాచారం.

ఇందుకు కారణం? సీట్లు పెంచితే రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీలకే ప్రయోజనం కలుగుతుందని తేలిందట..! తెలంగాణ బీజేపీ నాయకులు సీట్లు పెంచొద్దని గట్టిగా చెప్పారట..! దీన్ని అమిత్‌ షా కేంద్రం చెవిన వేయడంతో రాజకీయంగా ప్రయోజనంలేని పని చేయడమెందుకని పక్కన పెట్టిందని తెలుస్తోంది. ప్రస్తుతం సీట్లపెంపు పైలు న్యాయశాఖలో ఉంది. అసలైతే 2026 వరకూ ఏ రాష్ట్రంలోనూ సీట్లు పెంచకూడదు. కాని విభజన దృష్ట్యా అప్పటి యూపీఏ సర్కారు తెలుగు రాష్ట్రాలకు ఈ వెసులుబాటు కల్పించింది. 

కాని రాజ్యాంగం సవరించకుండా, దాన్ని పార్లమెంటు ఆమోదించకుండా పెంపు సాధ్యంకాదు. ఈ కథలో మరో కోణమేమిటంటే... తెలంగాణ బీజేపీ నాయకులు అసెంబ్లీ సీట్లు పెంచకూడదని కోరుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నాయకులు స్థానాలు పెరగాలని కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏమనుకుంటున్నారో తెలియదు. ఆంధ్రా బీజేపీ నాయకుల్లో కొందరు వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయబోవడంలేదని, టీడీపీతో కలిసే పోటీ చేస్తామని, కాబట్టి ఆ పార్టీ కోరుతున్నట్లు సీట్లు పెంచాలని అంటున్నారు. సీట్లు పెరిగితేనే బీజేపీకి కూడా ఎక్కువ సీట్లు కేటాయించే అవకాశముంటుంది.

సీట్లు పెంచాలని కోరుతూ ఆంధ్రా నుంచి బీజేపీ, టీడీపీ నేతల బృందం పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షాను కలిసినప్పుడు సీట్లు పెంచడంవల్ల ప్రయోజనం ఉంటుందా? అని బీజేపీ నేతలను ఆయన అడిగారు. సీట్లు పెంచడంవల్ల తనకు ప్రయోజనం కలగకపోతే బీజేపీ ఆ పని చేయదు. ఏం జరుగుతుందో చూడాలి. 

Show comments