టీడీపీ సెల్ఫ్‌గోల్‌!

జిల్లాలో పోయిన పరువు

పార్టీలో సమన్వయ లోపం

దూకుడు మీదున్న విపక్షం

విశాఖపట్నం జిల్లాలో మెజారిటీ సీట్లు తమవేనని, విపక్షాలకు ఏ మాత్రం బలం లేదని, జనంలో ఆదరణ అంతకంటే లేదని మిడిసి పడిన టీడీపీకి గట్టి షాక్‌ ఇచ్చేలా వైసీపీ ఆధ్వర్వంలో నగరం నడి బొడ్డున మహా ధర్నా జరిగింది. ఈ ధర్నాకు వామపక్షాలతో పాటు, ప్రజా సంఘాలు కూడా గట్టి మద్దతుగా నిలవడంతో తెలుగుదేశం నేతలకు ఏం పాలుపోవడంలేదు.

వైసీపీ అధినేత జగన్‌ స్వయంగా పాల్గొన్న ఈ మహా ధర్నాకు జనం పెద్దఎత్తున స్వచ్చందంగా తరలిరావడంతో అధికార పార్టీ గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. విశాఖ నగరాన్ని తాము అభివృద్ధి చేశామని, కడప రాజకీయాలకు చోటిస్తే వైజాగ్‌ భ్రష్టుపట్టిపోతుందని పదే పదే ప్రచారం చేసి మూడేళ్ల క్రితం జగన్‌ తల్లి విజయమ్మను ఓడించిన టీడీపీకి తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు.

ఎంతసేపూ జగన్‌పైన అవినీతి ఆరోపణలు, జైలు కేసులు, రౌడీ లు, గూండాలు అంటూ వైసీపీ నేతలపై ఆరోపణలు చేస్తూ వచ్చిన తెలుగుదేశం నేతలకు ఈసారి పప్పులు ఉడకలేదు. విశాఖలో జీవీఎంసీ ఎదురుగా ఈ నెల 22న జగన్‌ ఆధ్వర్వంలో నిర్వహించిన మహా ధర్నాను అడ్డుకోవడానికి టీడీపీ పెద్దలు చేయని ప్రయత్నం లేదు, అదే రోజున పోటీ సభను నిర్వహిస్తామని ఆ పార్టీ నగర అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌ బీరాలు పలికారు.

రెండు సభలూ ఒకేసారి నిర్వహిస్తామంటే ఎటూ పోలీసులు అభ్యంతరం చెబుతారని, చివరికి ఏ సభా కాకుండా పోతుందన్న ఎత్తుగడ వేశారు, అయితే అది వికటించి వైసీపీ మహా ధర్నా విజయవంతంగా జరిగితే, టీడీపీ సభ అన్నదే లేకుండా పోయింది. అత్యుత్సాహంతో టీడీపీ పెద్దలు పోటీ సభ పేరుతో చేసిన హంగామాకు తెలుగుదేశం నుంచే మద్దతు లభించకపోవడం గమనార్హం.

ఆ పార్టీలోని ఓ వర్గం సభకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే, సభ నిర్వహించాలనుకున్న మరో వర్గంలోనూ సమన్వయం లేకపోవడంతో మొదట వాయిదా వేసుకుని చివరికి సభనే రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విధంగా టీడీపీ సెల్ఫ్‌గోల్‌ కొట్టుకుని పరువు పోగొట్టుకుందని ఆ పార్టీలో చర్చ సాగుతోంది. జిల్లా ఇన్‌ చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పోటీ సభను రద్దు చేసు కోమని ఆదేశాలు జారీ చేయడంతో చేసేది లేక తమ్ముళ్లు తోక ముడిచారు.

నిజానికి అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపేందుకు ప్రతిపక్షాలూ సభలూ, సమావేశాలు నిర్వహించడం రివాజు. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్న సమయంలోనూ అనేక సార్లు ఇలాగే జరిగింది. చిత్రంగా టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచే దుస్సంప్రదాయానికి ఆ పార్టీలోని ఆర్భాటరాయుళ్లు తెర తీస్తున్నారు. ప్రతిపక్షం ఆందోళనకు పిలుపు ఇచ్చిన వెనువెంటనే పోటీ సభల పేరుతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు.

నిజానికి విశాఖ జిల్లా భూ కుంభకోణంలో తమ పాత్ర లేదన్న ధీమా కనుక ఉంటే విపక్ష వైసీపీ కంటే ముందే టీడీపీ పెద్దలు నగరంలో సభపెట్టి వాస్తవాలు జనానికి ఎందుకు చెప్ప లేదన్న ప్రశ్నకు జవాబు లేదు. అసలు మీడియా దీనిపై అడిగిన ప్రశ్నలకు సైతం మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి సరైన సమాధానం రాని దుస్థితి నెలకొన్న తరుణంలో సభ పెట్టి ఏం చెబుతారన్న దానికి కూడా బదులు లేదు.

ఏదో విధంగా విపక్షాన్ని అడ్డగించాలన్న ఆదుర్దాలో దూకుడుగా ముందుకెళ్లిన టీడీపీ తమ్ముళ్లు మరింతగా ఇరకాటంలో పడ్డారని పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక, వైసీపీ మహాధర్నా విషయంలో పార్టీలోని ఓ వర్గం ఎంతలా కలవరపడిందంటే నగరంలో జగన్‌ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను సైతం పెట్టిన వెంటనే తీసేయించేంతవరకూ నిద్రపోలేదు.

నగరంలో ఉన్న ప్రభుత్వ అతిధి గృహం వద్ద జగన్‌ బొమ్మతో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ఊడదీసి బాబు నవనిర్మాణ దీక్షల పాతఫ్లెక్సీలను ఏర్పాటుచేసేంతలా తమ్ముళ్ల పైత్యం ప్రకోపించిందనే చెప్పుకోవాలి. ప్రభుత్వ అతిథి గృహంలో కేబినెట్‌ ర్యాంకు మంత్రి హోదాలో ప్రతిపక్షనేత సైతం బసచేసేందుకు అవకాశం ఉంటుందని తెలిసినా అదంతా తమ సొంతమైనట్లుగా టీడీపీ నేతలు వ్యవహరించడం విడ్డూరం.

ఇక, అన్నింటి కన్నా పరాకాష్ట జగన్‌ మహాధర్నా నిర్వహించిన ప్రాంతాన్ని టీడీపీనేతలు శుద్ది చేయడం, అదే రోజు సాయంత్రం అర్బన్‌ జిల్లా టీడీపీ నేతలంతా సభా ప్రాంగాణానికి చేరుకుని వైసీపీ నేతల రాకతో అపవిత్రమైన ప్రదేశాన్ని తాము పరిశుద్ధం చేస్తున్నట్లుగా పేర్కొంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇదంతా చూసిన జనం ముక్కున వేలేసుకున్నారు, మరీ ఇంత చౌకబారు రాజకీయమేమిటని ఆక్షే పించారు.

ఇదిలా ఉండగా, జిల్లాలో టీడీపీ తీరు పట్ల ఇన్‌చార్జి మంత్రి చినరాజప్పసైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. ఇకపై నెలకు రెండు పర్యాయాలు జిల్లాలో పార్టీ సమన్వయం కోసం సమావేశాలు నిర్వహిస్తామని, ఒక్కోసారి ఒక్కో నియోజకవర్గంలో నిర్వహించడం ద్వారా పార్టీ పటిష్టతకు అంతా కృషి చేయాలని ఆదేశించారు. మహాధర్నా విజయవంతం కావడం జిల్లాలో మారుతున్న రాజకీయ వాతావరణానికి అద్దంపడుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అభ్యర్ధికి వైసీపీ మద్దతు ఇవ్వడం పట్ల ఆగ్రహంగా ఉన్న వామపక్షాలు సైతం విశాఖ భూ దందాకు ఉన్న సీరియస్‌నెస్‌ను అర్ధంచేసుకుని ఆ పార్టీతో చేతులు కలిపాయి. చాలాకాలం తరువాత వైసీపీకి ఇతర పార్టీల నుంచి మద్దతు లభించడంతో జిల్లాలో విపక్షం ఐక్యత చాటుకున్నట్లైంది.

ఇది రానున్న రోజులలో మరింతగా బలపడితే అధికార పార్టీకి కొత్త చిక్కులు ఎదురవడం ఖాయమంటున్నారు. ఇక, జనంలోనూ తెలుగుదేశం పట్ల మునుపటి నమ్మకం సడలిందని, భూ దందాలో ఆ పార్టీ పెద్దల ప్రత్యక్ష, పరోక్ష పాత్ర ఉందన్న సత్యాన్ని ప్రజానీకం అంగీకరిస్తున్నారనడానికి కూడా మహాధర్నా విజయవంతం కావడం ఓ సంకేతమంటున్నారు.

-పివిఎస్‌ఎస్‌ ప్రసాద్‌

Show comments