కేసీఆర్‌ మార్క్‌ 'పొలిటికల్‌ రిజర్వేషన్‌'.!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనే ముస్లింలకు రిజర్వేషన్‌ అంశం తెరపైకి వచ్చింది. రాజశేఖర్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ రిజర్వేషన్ల అంశాన్ని. తద్వారా ముస్లిం ఓటు బ్యాంకుని 'పదిలం' చేసుకోవాలన్నది ఆయన వ్యూహం. అయితే, రిజర్వేషన్ల అంశంపై రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వానికి మొట్టికాయలు తప్పలేదు. ఆయన తలచింది వేరు, జరిగింది వేరు.! న్యాయస్థానాల చీవాట్లతో పెంచిన రిజర్వేషన్లను తగ్గించాల్సి వచ్చిందనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రిజర్వేషన్ల పేరుతో రాజకీయం షురూ చేశారు. 2019 ఎన్నికలకి ఇది ప్రిపరేషన్‌. మూడేళ్ళు నిద్రపోయి, ఇప్పుడు తీరిగ్గా రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం రాజకీయం కాక మరేమిటి.? 'అప్పుడే ఎక్కడున్నాయ్‌ ఎన్నికలు.?' అని మీడియాని కేసీఆర్‌ ప్రశ్నించేశారుగానీ, ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం కన్పిస్తోందన్నది నిర్వివాదాంశం. 

రెండేళ్ళ ముందే సార్వత్రిక ఎన్నికల కోసం హంగామా షురూ అయ్యింది. వివిధ రాజకీయ పార్టీలు మేనిఫెస్టోల తయారీకి కసరత్తులు ప్రారంభించేస్తున్నట్లు ప్రకటించేశాయి కూడా. ఈ నేపథ్యంలోనే కేసీఆర్‌ కూడా తొందరపడ్డారు. ముస్లింలకు మతం కోటాలో కాకుండా.. అంటూ రిజర్వేషన్ల అంశానికి క్యాబినెట్‌ ద్వారా గ్రీన్‌ సిగ్నల్‌ ఇప్పించేశారు. రేప్పొద్దున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం కూడా పాస్‌ చేయించేస్తారు. అయితే, అక్కడితోనే కథ అయిపోదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. 

న్యాయస్థానాలు షరామామూలుగానే కేసీఆర్‌ నిర్ణయాన్ని తిప్పి కొట్టబోతున్నాయి. గతంలో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడ జరగాల్సింది రాజ్యాంగ సవరణే. అది జరగాలంటే కేంద్రం సుముఖత వ్యక్తం చేయాలి. కేంద్రంలో వున్నది నరేంద్రమోడీ సర్కార్‌. ముస్లిం రిజర్వేషన్లను ఏ కేటగిరీలో అయినాసరే మోడీ సర్కార్‌ ఒప్పుకునే ప్రసక్తే లేదు. దాంతో, కేసీఆర్‌ తాను కోరుకుంటున్న రాజకీయ లబ్దిని పొందడానికి మార్గం సుగమం అవుతుంది. 

ముస్లింలకు రిజర్వేషన్లు దక్కవు.. కానీ, కేసీఆర్‌కి రాజకీయ లబ్ది చేకూరుతుంది.. ఎందుకంటే, 2019 ఎన్నికల్లో కేసీఆర్‌, బీజేపీని ఇరకాటంలో పెట్టడానికి ఇదే అస్త్రాన్ని వాడుకోబోతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు దక్కలేదు.. కానీ, కేసీఆర్‌ కుటుంబంలో చాలామందికి ఉద్యోగాలొచ్చాయి. ఇప్పుడీ, రిజర్వేషన్ల వ్యవహారమూ అంతే కాబోతోంది. 

తమిళనాడునో, ఇంకో రాష్ట్రాన్నో చూపించి కేసీఆర్‌ చెబుతున్న మాటలు చాలా చాలా 'స్వీట్‌'గా అన్పించడం మామూలే. అంత తీయగా మాటలు చెప్పడం కేసీఆర్‌కి వెన్నతో పెట్టిన విద్య. కేజీ టూ పీజీ ఉచిత విద్య.. అన్నారాయన. ఏదీ, ఎక్కడ.? డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళను లక్షల సంఖ్యలో ప్రకటించారు.. పదుల సంఖ్యలో కూడా పూర్తయన పరిస్థితి లేదు. తన సొంత నియోజకవర్గంలో తప్ప, డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళ దాఖలాల్లేవు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. అదీ పెద్ద మాయే. చెప్పుకుంటూ పోతే కథ చాలానే వుంది. ఈ వైఫల్యాల్ని కప్పిపుచుకునేందుకు, మళ్ళీ కొత్తగా ఈ రిజర్వేషన్ల నాటకం తెరపైకొచ్చింది. 

కాంగ్రెస్‌ ఎటూ మైనార్టీ ఓటు బ్యాంకు కోల్పోవడానికి సిద్ధంగా వుండదు గనుక, టీఆర్‌ఎస్‌ నిర్ణయానికి జై కొట్టాల్సిందే. బీజేపీ మిత్రపక్షం గనుక టీడీపీ వ్యతిరేకిస్తుంది. ఇంకేముంది, తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు, ముస్లిం ఓటు బ్యాంకుని 'మెట్టు'గా వాడుకోబోతున్నారన్నమాట. ఇంతకీ, కేసీఆర్‌ ఆశిస్తున్న పొలిటికల్‌ రిజర్వేషన్‌ ఆయనకు దక్కుతుందా.? వేచి చూడాల్సిందే.

Show comments