సాధారణంగా అధికారం ఉన్న చోట అహంకారం, తలపొగరు ఉంటాయి. కళ్లు నెత్తికెక్కుతాయి. ఎవ్వరినీ లెక్కచేయనితనం ఉంటుంది. 'నా ముందు నువ్వెంత?' అనే భావం ఉంటుంది. ఈ లక్షణాలు ఉండటం తమకు అలంకారప్రాయమని వారు అనుకోవచ్చు. కాని ఇవి అవలక్షణాలని గుర్తించాలి. తాత్కాలికంగా ఇది బాగానే ఉండొచ్చు. కాని దీర్ఘకాలంలో దెబ్బతినే ప్రమాదముంది. ఇలాంటి ప్రమాదం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొత్త మంత్రి కమ్ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు పొంచి ఉంది. ఇది మనం చెబుతున్నది కాదు. కొందరు సీనియర్ మంత్రులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 'లోకేష్ సీనియర్ మంత్రులను గౌరవించడంలేదు. తోటి మంత్రులను, నాయకులను లెక్కచేయడంలేదు' అనే అభిప్రాయం చాలామంది మంత్రుల్లో ఏర్పడిపోయినట్లు సమాచారం. ఈ అభిప్రాయం ఏర్పడటానికి కారణం వ్యక్తిగతంగా లోకేష్ వ్యవహారశైలా? లేక ఆయన కార్యాలయం (పేషీ) నిర్వాకమా? తప్పు ఎక్కడ జరుగుతున్నా సరిచేసుకోవాల్సిన బాధ్యత మాత్రం లోకేష్ మీదనే ఉంది.
ఆయన మీద ఉన్న ప్రధానమైన విమర్శ లేదా ఆరోపణ ఏమిటంటే...తనను కలవడానికి వచ్చినవారు ఎంతటివారైనా సరే గంటల తరబడి వెయిట్ చేయాల్సిందే. పార్టీ నాయకులైనా, మంత్రులైనా ఇదే పరిస్థితి. లోకేష్ మంత్రి అయినప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు కాబట్టి పార్టీ సీనియర్ నాయకులు కూడా ఆయనతో మాట్లాడేందుకు వస్తుంటారు. ఎవ్వరొచ్చినా 'వెయిట్ అండ్ సీ' సూత్రాన్ని పాటించాల్సిందే. ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకున్నా ఎదురుచూపులు తప్పడంలేదట...! మంత్రులు, నాయకులు వచ్చిన సమాచారాన్ని పేషీలోని సిబ్బంది ఆయనకు చేరవేయడంలేదు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థం కావడంలేదు. ఈమధ్యే కొత్త ఎక్సయిజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చినబాబు కార్యాలయానికి వచ్చి దాదాపు గంట సేపు మంత్రి ఛాంబర్ బయట ఇతర నాయకులతో కలిసి వెయిట్ చేశారు. ఒక మంత్రి ఇతర సందర్శకులతోపాటు కూర్చుని ఎదురుచూడటమంటే ఇబ్బందికరమే కదా...!
12.30కు లోకేష్ కార్యాలయానికి వచ్చిన జవహర్ తన రాకను పేషీకి తెలియచేశాడు. 1.30కు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సివుంది. ఈలోగా మర్యాదపూర్వకంగా చినబాబును కలుద్దామని వెళ్లగా 55 నిమిషాలు వెయిట్ చేయాల్సివచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. లోకేష్ గతంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన కొంత కాలానికే 'వెయిట్ చేయిస్తున్నాడు' అనే విమర్శలు ఎదుర్కొన్నాడు. గుంటూరులోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన చాలామంది నాయకులు అసంతృప్తిగా తిరిగొచ్చేవారు. అపాయింట్‌మెంట్ లేకుండా పార్టీ కార్యాలయానికి వెళితే గంటల తరబడి వెయిట్ చేయాల్సివచ్చేది. అదే పరిస్థితి మంత్రి అయ్యాకా కొనసాగుతోంది. పార్టీ కార్యాలయంలో గంటల తరబడి ఎదురుచూసిన అనుభవం సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి పీతల సుజాత, పైడికొండాల మాణిక్యాలరావు, మంరికొందరు మంత్రులకు ఉంది.
లోకేష్ హాజరు కావల్సిన కార్యక్రమాల షెడ్యూలు విషయంలోనూ ఆయన పేషీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. లోకేష్ ప్రారంభోత్సవాలు చేస్తున్న ఐటీ కంపెనీల వివరాలు పేషీ ఆయనకు తెలియచేయడంలేదట. ఆయన హాజరయ్యే కార్యక్రమాల వివరాలు కార్యాలయ సిబ్బంది కొన్ని మీడియా సంస్థలకే (వారు ఎంపిక చేసుకున్న) అందిస్తున్నారట...! లోకేష్ పేషీ వ్యవహారశైలి మారకపోతే ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సివస్తుందని ఓ సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. పేషీ అనేది లోకేష్ నియంత్రణలో ఉండాలిగాని ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తే ఎలా?
ఇక్కడ పేషీనే పూర్తిగా తప్పుపట్టలేం. లోకేష్‌కు కూడా అహంకారపూరిత వైఖరి ఉన్నట్లు గతంలో వార్తలొచ్చాయి. కాబట్టి ఆయనిప్పుడు కొత్తగా మారాడని చెప్పలేం. ఇక లోకేష్ ఈమధ్య అంబేద్కర్ జయంతి రోజు 'అంబేద్కర్ వర్థంతికి మీ అందరికీ శుభాకాంక్షలు' అని చెప్పి నవ్వులపాలయ్యాడు. ప్రమాణ స్వీకారం రోజు ప్రమాణపత్రంలోని తెలుగు పదాలు చదవలేక ఇబ్బంది పడ్డాడు. దీంతో చంద్రబాబు కుమారుడిని మందలించారని సమాచారం. పరకాల ప్రభాకర్, మండలి బుద్ధప్రసాద్ దగ్గరకు వెళ్లి తెలుగు నేర్చుకొమ్మని సలహా ఇచ్చారట. చినబాబు భాషను, ప్రవర్తనను మెరుగుపరుచుకోవాలి.