రజనీకాంత్‌కి తగిలింది జీఎస్‌టీ సెగ

జీఎస్‌టీతో దేశం అభివృద్ధి పథంలోకి వెళుతుందన్నది ప్రధాని నరేంద్రమోడీ ఉవాచ. కానీ, సినీ రంగం జీఎస్‌టీ ఎఫెక్ట్‌తో తల్లడిల్లిపోనుంది. ప్రధానంగా దక్షిణాది సినీ పరిశ్రమ, జీఎస్‌టీ దెబ్బకు కుదేలవడం ఖాయమని సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం విదితమే. అయితే ఈ జీఎస్‌టీ హిందీ సినిమాలకు ఉపకరిస్తుందనే వాదనా లేకపోలేదు. 

వినోదపు పన్ను రాయితీ విషయంలో ఎప్పటినుంచో ప్రభుత్వాలకు సినీ పరిశ్రమ నుంచి విజ్ఞప్తులు అందుతూనే వున్నాయి. సినీ పరిశ్రమకు ప్రోత్సాహకాలు అందించడంలోనూ ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ చూపడంలేదన్న ఆరోపణల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ పరిశ్రమ ఎంతగా ఆందోళన చేసినా, జీఎస్‌టీ వేళ సినీ పరిశ్రమ విజ్ఞప్తుల్ని కేంద్రం పరిగణంలోకి తీసుకోలేదు. 

ఇక, తమిళ సినీ పరిశ్రమ జీఎస్‌టీని వ్యతిరేకిస్తూ, థియేటర్ల బంద్‌కి నిర్ణయించుకుంది. జులై 3 నుంచి తమిళనాడులో థియేటర్లు బంద్‌ కానున్నాయి. ముందుగా ఒక్కరోజు బంద్‌ చేద్దామనుకున్నా, ఇప్పుడిప్పుడే ఆలోచనలు మారుతున్నాయి. ఎన్ని రోజులపాటు బంద్‌ చేయాలనే విషయమై చర్చలు జరుగుతున్నాయక్కడ. 

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్న రజనీకాంత్‌పై, తమిళ సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు జీఎస్‌టీ గొడ్డలి పెట్టులా తయారైందనీ, రాజకీయాల్లోకొస్తానంటున్న రజనీకాంత్‌ వున్నపళంగా జీఎస్‌టీపై స్పందించాలనీ కొందరు నిర్మాతలు డిమాండ్‌ చేస్తున్నారు. Readmore!

శింబు తండ్రి, ప్రముఖ నిర్మాత, దర్శకుడు టి.రాజేందర్‌ అయితే రజనీకాంత్‌పై ఆవేశతో ఊగిపోయారు. సినీ పరిశ్రమను ఉద్ధరించలేని రజనీకాంత్‌, రాజకీయాల్లోకొచ్చి ఏం చేస్తాడని ప్రశ్నిస్తున్నారాయన. 

మొత్తమ్మీద, అటు తిరిగి ఇటు తిరిగి జీఎస్‌టీ దెబ్బ రజనీకాంత్‌కి గట్టిగానే తగిలేలా వుంది. అయినా, మొత్తంగా తమిళ సినీ పరిశ్రమ జీఎస్‌టీకి వ్యతిరేకంగా ఆందోళన చేయాలనుకుంటే ఓకే.. మధ్యలో రజనీకాంత్‌ని ఎందుకు లాగుతున్నారట.? ఓహో, ప్రధాని నరేంద్రమోడీకి రజనీకాంత్‌ స్నేహితుడు కాబట్టే అయివుంటుంది లెండి.!

Show comments