ఎమ్మెల్యే రేటు 2 కోట్లు: బాగా చీప్‌

తమిళనాడులో ఎమ్మెల్యేలను ఏ స్థాయిలో శశికళ వర్గం కొనుగోలు చేసిందో సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తోంది నేషనల్‌ మీడియా. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి అనుకూలంగా ఓటేయడానికి తనకు కోటి రూపాయల ఆఫర్‌ ఇచ్చినట్లు ఓ ఎమ్మెల్యే చెబితే, మరో ఎమ్మెల్యేకి 2 కోట్ల రూపాయలతోపాటు, కొంత మొత్తంలో బంగారాన్ని శశికళ అండ్‌ టీమ్‌ ఎరగా చూపించిందట. ఈ మొత్తం వ్యవహారం దినకరన్‌ కనుసన్నల్లో జరిగింది. 

అన్నట్టు, ఎన్నికల్లో శశికళ వర్గానికి రెండాకుల గుర్తు దక్కడం కోసం ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన ఘనుడు దినకరన్‌. ఇప్పుడా కేసులో దినకరన్‌ నిండా మునిగిపోయిన విషయం విదితమే. తాజాగా, ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమిళనాడులో శశికళ వర్గం ఇరకాటంలో పడింది. 

అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు తమిళనాడులో కొత్త కనిపిస్తున్న వ్యవహారమేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వ్యవహారం జోరుగా సాగుతోంది. వైఎస్‌ మరణానంతరం ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గట్టిగానే తెరపైకొచ్చింది. మొన్నీమధ్యనే తెలంగాణలో ఓ ఎమ్మెల్యే ఓటు (ఎమ్మెల్సీ ఎన్నికల కోసం) ఖరీదుని ఐదు కోట్లుగా లెక్క కట్టింది తెలుగుదేశం పార్టీ. 50 లక్షలు అడ్వాన్స్‌ ఇస్తూ, టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి అడ్డంగా బుక్కయిపోయిన విషయం విదితమే. ఆ లెక్కన, తమిళనాడులో ఎమ్మెల్యేల రేటు మరీ చీప్‌ అనుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో ఎమ్మెల్యే రేటు 10 నుంచి పాతిక కోట్ల దాకా పలుకుతోందన్నది ఓ అంచనా. అది పరిగణనలోకి తీసుకుంటే, తమిళనాడులో ఎమ్మెల్యేల కోసం శశికళ వర్గం మరీ 'చీప్‌'గా ఖర్చుపెట్టిందని భావించాలేమో. అన్నట్టు, కర్నాటకలో యడ్యూరప్ప సర్కార్‌ ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో, ఒక్కో ఎమ్మెల్యేకి 4 కోట్ల నుంచి ఆరు కోట్ల దాకా చెల్లించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? 

ప్రజాస్వామ్యం ఎంతగా ఖూనీ అయిపోతోందో ఈ కొనుగోళ్ళు వ్యవహారాన్ని చూస్తే అర్థమవుతుంది. అయినా ఏం చేస్తాం.? ఇది మన ఘనమైన ప్రజాస్వామ్యం. 

Show comments