నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీకి సహజమైన సంస్కృతి కాదు. హద్దు మీరిన స్వేచ్ఛకు కాంగ్రెస్ పార్టీ ఒక నిదర్శనం. ఆ పార్టీలో నాయకులు.. ఎవరు ఎవరిని ఏ రేంజిలో తిట్టుకున్నా సరే.. ఎవరి వెనకాల ఎవరు ఏ రేంజిలో గోతులు తవ్వుకున్నా సరే.. వారి మీద క్రమశిక్షణ చర్యలు గట్రా తీసుకోవడం గురించి అధిష్టానం అస్సలు పట్టించుకోదు. మరో రకంగా చెప్పాలంటే.. పార్టీలోని నాయకులు ఎప్పుడూ పరస్పరం కలహించుకుంటూ ఉంటేనే అధిష్ఠానానికి విలువ పెరుగుతూ ఉంటుందనేది వారి వ్యూహం. ఇలాంటి అంతర్గత ప్రజాస్వామ్యం, వాక్ స్వేచ్ఛ ఎంత అపరిమితంగా ఉంటుందంటే.. సోనియా కుటుంబాన్ని చెడామడా తిట్టిపోసే నాయకులు కూడా.. పార్టీలో మునుపటిలాగానే చెలామణీ అయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్లుంది. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా నోరెత్తితే వేటు వేసేస్తారేమో అనే అభిప్రాయం కలుగుతోంది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని బిజినెస్ డీలింగ్ గా మార్చేసి... ప్రచార వ్యూహాలను కార్పొరేట్ బిల్లింగ్ లెవెల్ కు తీసుకువెళ్లిన ప్రశాంత్ కిషోర్ విషయంలో ఇంకా చాలా సానుకూల అభిప్రాయంతోనే ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకప్పట్లో మోడీకి ప్రచారవ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ను చాలా భారీ ప్యాకేజీ ఆశ చూపించి.. కాంగ్రెస్ పార్టీ తమవైపు లాక్కుంది. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఆయన చాలా కాలం ముందుగానే రంగంలోకి దిగారు. సమాజ్ వాదీ పార్టీలో ముసలం పుట్టడానికి ముందునుంచే ఆయన రంగంలోకి దిగి, వారితో కాంగ్రెస్ మైత్రికి పావులు కదిపారు. కేవలం ఎస్పీతో బంధం ద్వారా మాత్రమే కాంగ్రెస్ విజయం సాధ్యం అన్నట్లుగా అక్కడ పావులు కదిపారు. మొత్తానికి పార్టీ సాంతం భ్రష్టుపట్టిపోయింది. పార్టీ జెండాలు మోసిన వాళ్లను, పార్టీకోసం త్యాగాలు చేసిన వాళ్లను పట్టించుకోకుండా, ఇలాంటి కార్పొరేట్ వ్యూహకర్తల మీద ఆధారపడినందుకు యూపీ కాంగ్రెస్ లోకల్ నాయకులు మండిపడడం సహజమే. ఆ క్రమంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ను తూలనాడిన వారి మీద కాంగ్రెస్ పార్టీ ఏకంగా వేటు వేసేయడమే ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.
ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నారు? ఆయనను పట్టుకొచ్చిన వారికి 5 లక్షలు బహూకరిస్తాం అంటూ లక్నో కాంగ్రెస్ కార్యాలయం బయట ఓ పోస్టరు వెలిసింది. తర్వాత దానిని తొలగించేశారు కూడా. అయితే ఆ పోస్టరు ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాజేష్ సింగ్ ను పార్టీనుంచి బహిష్కరించారు. డబ్బులకోసం వ్యూహాలు అమ్ముతాం అనే వారిని నమ్ముతున్నారు తప్ప.. పార్టీకోసం రక్తమాంసాలు ధారపోసిన తమను నమ్మడం లేదంటూ రాజేష్ సింగ్ ఇప్పుడు పార్టీని తిట్టిపోస్తున్నారు.
అయితే ఈ పరిణామాల్లో కొత్తగా కనిపిస్తున్న మార్పు ఏంటంటే.. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరిట... ఎవరు ఎవరినైనా.. ఏ రేంజిలోనైనా తిట్టుకోడానికి ఇదివరకు చాన్సు ఉండేది. ఇప్పుడు చూడబోతే ఆ పరిస్థితి మారినట్టుంది. అధిష్టానానికి ఇష్టులైన వారిమీద విమర్శలు చేస్తే పార్టీ ఏకంగా వెలివేసేసే పరిస్థితి వచ్చిందన్నమాట. అధిష్టానానికి అంతటి అసహనం ఉంటే.. అసలు ఆ పార్టీ ఎలా మనుగడ సాగించగలుగుతుంది అని అంతా అనుకుంటున్నారు.