ఇదేం రాజకీయం హీరోగారూ..!

ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా..? అంటున్నారు కమల్ హాసన్! జల్లికట్టు తరపున బ్యాటింగ్ చేస్తున్న కమల్ హాసన్ పోలీసులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. అల్లరి మూకలపై పోలీసులు విరుచుకుపడటాన్ని కమల్ తప్పుపడుతున్నాడు! ఈ విషయంలో ముఖ్యమంత్రి పన్నీరు సెల్వాన్ని కూడా కమల్ నిందించడం.. ఎంజీఆర్ బతికుంటే ఇలా జరిగేదా? అంటూ ప్రశ్నించడం ఈయన రాజకీయ ఉద్దేశాలతో మాట్లాడుతున్నాడా? అనే సందేహాలను కలిగిస్తోంది!

దశాబ్దాల క్రితం పోయిన ఎంజీఆర్ ను ప్రస్తావిస్తూ.. ఎంజీఆర్ ఉంటే ఇలా జరిగేదా? అంటూ ప్రశ్నించడం హాస్యాస్పదం! ఆయన పోయాకా ఎన్నో జరిగాయి.. అప్పుడంతా గుర్తురాని ఎంజీఆర్ ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చాడో కమల్ హాసనుడికి! ఇదంతా ఏదో సెంటిమెంటును రగిల్చే యత్నం చేస్తున్నట్టుగా ఉంది. 
అయినా.. కమల్ జల్లికట్టుకు అనుకూలంగా మాట్లాడటమే పెద్ద విచిత్రం! తను దేవుడిని నమ్మను అని చెబుతాడు, తను నాస్తికుడి అని తరచూ చెప్పుకొంటూ ఉంటాడు.. మరి దైవమే లేదు, సర్వం నాస్తి.. అనే చెప్పుకునే వ్యక్తి ‘సంప్రదాయం’ ను సమర్థించడం ఏమిటి? ప్రోగ్రెసివ్ ఆలోచన ఉండాలని అందరికీ చెప్పే సంస్కరణ వాది.. అపర సంప్రదాయ వాదిలా మాట్లాడటం ఏమిటి? 

కలహాయించుకోవడానికే మతం, సంప్రదాయం అంటూ.. తన ‘దశావతారం’ సినిమా ఇంట్రోలోనే చెప్పిన వ్యక్తి, ఒకే మతం అయినా శైవులు- వైష్ణవులు ఉన్మాదుల్లా కొట్టుకు చచ్చారు.. అని ఉటంకించిన ఆలోచన పరుడు.. ఇప్పుడు జల్లికట్టు సంప్రదాయం, సంప్రదాయాన్ని కాపాడుకుందాం.. అంటూ మాట్లాడుతుండటం,ఈ అంశం గురించి మాట్లాడటాన్ని మిగతా వాళ్లు ఆపేసినా ఈయన మాత్రం కొనసాగిస్తుండటం.. విశేష పరిణామమే.

ముఖ్యమంత్రిపై కూడా మాటల దాడి ద్వారా కమల్ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇది వరకూ చేసిన రాజకీయ ప్రకటనలతోనే కమల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. జయ మరణించినప్పుడు కూడా కమల్ ట్వీట్లపై విమర్శలు వచ్చాయి. తన అభిప్రాయాలను తాను చెప్పుకునే  స్వేచ్ఛ కమల్ కు ఉండవచ్చు గాక.. ఈ చెప్పుకోవడంలో అసలు ఉద్దేశాలు ఏమిటో మరి!

Show comments