లక్ష కోట్లు.. లక్ష ఎకరాలు.. ఏదెక్కువ.?

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచేశారనీ, ఆ దోపిడీ విలువ లక్ష కోట్ల రూపాయలంటూ అప్పట్లో తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసిన విషయం విదితమే. ఈ లక్ష కోట్ల దోపిడీకి సంబంధించి కేసులు అలా అలా నడుస్తున్నాయంతే. అక్రమాస్తుల కేసులో జగన్‌ జైలుకి వెళ్ళి వచ్చారు కూడా. అయితే, ఇప్పటికీ ఆయన అక్రమాస్తుల కేసులో నిందితుడు మాత్రమే.! 

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిందిగానీ, జగన్‌ మీద అక్రమాస్తుల కేసు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం ఆశ్చర్యకరమే కదా.! ఆ సంగతి అలా వుంచితే, వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కార్‌ అవినీతికి పాల్పడుతోందనీ, రాజధాని పేరుతో లక్ష కోట్లకు పైనే భూ కుంభకోణానికి తెరలేపిందనీ అప్పట్లో ఆరోపించింది. అమరావతి పరిధిలో భూములన్నీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే కొల్లగొట్టారన్నది వైఎస్సార్సీపీ ఆరోపణ. 

'ఏం, టీడీపీ నేతలమైతేనేం.. మేం భూముల్ని కొనుగోలు చేయకూడదా.?' అంటూ అతి అమాయకంగా టీడీపీ నేతలు ప్రశ్నించి అడ్డంగా బుక్కయిపోయినా, టీడీపీ అనుకూల మీడియా ఆ ఉదంతాన్ని లైట్‌ తీసుకుందనుకోండి.. అది వేరే విషయం. 

ఇప్పుడిక, కొత్తగా లక్ష ఎకరాల భూ కుంభకోణం ఆరోపణలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతానికి అతి పెద్ద నగరమైన విశాఖ కేంద్రంగా ఈ భూ కుంభకోణం జరిగింది. హుద్‌హుద్‌ తుపాను కారణంగా రికార్డులు గల్లంతయ్యాయంటూ, అధికారులు చేతులెత్తేయడం గమనార్హమిక్కడ. అడ్డగోలుగా భూముల్ని కొల్లగొట్టి, అధికార పార్టీ నేతలే రికార్డుల్ని మాయం చేశారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మొత్తం లక్ష ఎకరాల భూమి టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిందన్నది వైఎస్సార్సీపీ నేతల ఆరోపణ. 

చిత్రంగా, ఈ భూ కుంభకోణంపై వైఎస్సార్సీపీ సీనియర్‌ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఆయనే, ఈ మొత్తం వ్యవహారంపై అధికార పార్టీని నిలదీసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. అయితే, వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో నెంబర్‌ టూ అయిన విజయసాయిరెడ్డి, భూ కుంభకోణం గురించి మాట్లాడటమేంటన్నది టీడీపీ చేస్తున్న ఎదురుదాడి సారాంశం. 

ఒక్కటి మాత్రం నిజం. వైఎస్‌ జగన్‌ లక్ష కోట్ల దోపిడీ అన్నది పాత మాట. రాజధాని అమరావతిలో భూముల్ని కొల్లగొట్టేయడం, విశాఖ కేంద్రంగా భారీ భూ కుంభకోణానికి తెరలేపడం, వీటితోపాటుగా కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌.. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అయినాసరే, అంతా గప్‌చిప్‌. ఎందుకంటే, అక్కడున్నది నిప్పు నారా చంద్రబాబునాయుడు మరి.!

Show comments