తమిళ, తెలుగు భాషల్లో విజయవంతం అయ్యిందని అనిపించుకుంది కానీ, ‘ఓకే బంగారం’ సినిమాలో డెప్త్ లేదు. ఆ సినిమాతో మణిరత్నం మళ్లీ బ్యాక్.. అన్నారు కానీ, అసలు అది మణిరత్నం స్థాయి సినిమా కాదు! నేటి మెట్రో తరానికి తగ్గ పాయింట్ ను అయితే తీసుకున్నాడు కానీ.. ఆ పాయింట్ పై డెప్త్ లోకి వెళ్లలేకపోయాడు మణిరత్నం. సినిమా అంతా కేవలం సగం కథను మాత్రమే చెప్పినట్టుంటుంది. మిగతా కథ మిస్సింగ్!
అయినప్పటికీ తమిళ, తెలుగు భాషల్లో ఆ సినిమా బాగుందనిపించుకుంది. దానికి ఎన్నో కారణాలు. దుల్కర్- నిత్య ల జంట, రెహమాన్ సంగీతం, మణిరత్నం చాన్నాళ్ల తర్వాత అంతో ఇంతో బెటర్ సినిమాను చూపించడం! వంటి కారణాలు ‘ఓకే బంగారం’ సినిమాను ఓకే అనిపించేలా చేశాయి!
అయితే.. హిందీలో మాత్రం ఈ సినిమా నిరాశ పరిచింది. హిందీ రివ్యూయర్లు ప్రధానంగా చేసిన కంప్లైంట్.. సినిమాలో ‘డెప్త్’ లేదు. అంతా పైపైన తీసుకుపోయారు అనేది! ఇది వాస్తవమే. సౌత్ వెర్షన్ లో కూడా ఈ లోటు ఉంది. హిందీలో ఈ లోటే హైలెట్ అయ్యింది. మిగతా పాజిటివ్ పాయింట్లు చిన్నబోయాయి. ఫలితంగా తొలివారం ఈ సినిమా కలెక్షన్లు నిరాశాజనకంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇది వరకూ మణిరత్నం దక్షిణాదిన హిట్టు కొట్టిన ‘సఖి’ని కూడా ఆయన శిష్యుడొకరు ‘సాథియా’ పేరుతో రీమేక్ చేస్తే అది అట్లర్ ఫ్లాఫ్ అయి కూర్చుంది. ఇప్పుడు ‘ఓకే బంగారాన్ని’ ‘ఓకే జానూ’ అని తీస్తే అదే ఫలితం ఎదురవుతోంది!