రావయ్యా రజనీకాంతూ.!

ఎంచక్కా సినిమాలు చేసుకుంటూ తన గోలేదో తనది.. అన్నట్లు తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వ్యవహరిస్తోంటే, ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలైతే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో సంక్షోబం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్‌కి గాలమేసేందుకు వివిధ పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అందులో మొదటిస్థానంలో వున్నది బీజేపీనే. డైరెక్ట్‌గా బీజేపీ, ఇప్పుడు రజనీకాంత్‌ దగ్గరకి వెళ్ళే పరిస్థితి లేదు. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ని రంగంలోకి దించిందట. ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్య నేత ఒకరు రజనీకాంత్‌ని కలిసి, బీజేపీలోకి ఆహ్వానించారన్నది తాజా గాసిప్‌. 

'తూచ్‌, అలాంటి ప్రయత్నాలేమీ జరగడంలేదు.. అసలు రజనీకాంత్‌కి రాజకీయాలపై ఆసక్తి వుందనీ మేం అనుకోవడంలేదు..' అంటూ సదరు ఆర్‌ఎస్‌ఎస్‌ నేత సోషల్‌ మీడియాలో ఖండించి పారేశారు. కానీ, రజనీకాంత్‌ - నరేంద్రమోడీకి అత్యంత సన్నిహితుడన్న విషయం అందరికీ తెల్సిందే. ఇందులో దాచడానికేమీ లేదు. కొత్త పార్టీ పెట్టడం కన్నా, బీజేపీకి మద్దతివ్వడం మేలని చాలాకాలంగా అనుకుంటున్నా, ఆ మాట బయటపెట్టడానికీ మొహమాటపడ్తున్నాడాయన. 

'కొత్త పార్టీ పెట్టాల్సిందే..' అన్న రజనీకాంత్‌ అభిమానుల డిమాండ్‌ సంగతి సరే సరి. అభిమానులు డిమాండ్‌ చేయడం, ఆయన ఓ నవ్వు నవ్వేసి ఊరుకోవడం మామూలే. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సూపర్ స్టార్ పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంటారా.? అన్న విషయమై ఆయన సన్నిహితులూ పెదవి విప్పడంలేదు. 'మంతనాలు అయితే జరుగుతున్నాయి, రజనీకాంత్‌ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు..' అన్నది ఆయన సన్నిహితుల నుంచి బయటకు పొక్కుతున్న తాజా లీకుల సారాంశం. 

రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావొచ్చు.. వద్దనుకుంటే ఆ విషయమూ చెప్పెయ్యొచ్చు.. కానీ, ఇలా నాన్చితే ఎలా.? గతంలో చెప్పాను కదా.. అంటే కుదరదు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు హాట్‌ డెవలప్‌మెంట్స్‌ జరుగుతున్నాయి మరి.!

Readmore!

Show comments