మాట్లాడే ఛాన్సా.? అసలు అసెంబ్లీకి రానిస్తారా.?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కానుంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఇప్పటిదాకా ఉమ్మడి రాజధాని హైద్రాబాద్‌లోనే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇకనుంచి.. అంటే, రానున్న అసెంబ్లీ సమావేశాలు రాజధాని అమరావతిలో నిర్మించిన 'తాత్కాలిక అసెంబ్లీ'లోనే జరుగుతాయి. 

అంతా బాగానే వుందిగానీ, కొత్త రాష్ట్రం.. కొత్త అసెంబ్లీ.. అందులో 'పద్ధతులు' కొత్తగా వుంటాయా.? ప్రతిపక్షానికి అసెంబ్లీలో మాట్లాడనిచ్చేందుకు ఇప్పటిదాకా సుముఖత వ్యక్తం చేయని అధికారపక్షం, ఈసారన్నా అసెంబ్లీలో ఆ ఛాన్స్‌ని ప్రతిపక్షానికి ఇస్తుందా.? ఈ అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 'ఈసారన్నా మమ్మల్ని మాట్లాడనిస్తారా.?' అంటూ ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది కూడా.! 

అయితే, అధికార పక్షం వెర్షన్‌ ఇంకోలా వుంది. సభలో గలాటా సృష్టించడానికి కాకుండా, సభలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఇబ్బంది ఏమీ లేదన్నది అధికార పార్టీ వాదన. పైకి అధికార పక్షం చెప్పేదెలా వున్నా, తెరవెనుక ఆ పార్టీ వ్యూహాలు వేరేగా వుంటాయి. అసెంబ్లీలో మాట్లాడటం సంగతి తర్వాత, అసలంటూ అసెంబ్లీకి ప్రతిపక్షాన్ని రానిస్తారా.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొన్నీమధ్యనే ప్రతిష్టాత్మకంగా మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నిర్వహించింది. ఆ సదస్సుకి పొరుగు రాష్ట్రానికి చెందిన ఎంపీ కవితను ఆహ్వానించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిథులు వచ్చారు. కానీ, దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్‌కే చెందిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాకి ఆహ్వానం పంపి అవమానించారు.. అక్కడికి హాజరు కాకుండా చేయడం ద్వారా. దాంతో, సహజంగానే ప్రతిపక్షంలో 'మమ్మల్ని అసెంబ్లీకి రానిస్తారా.?' అన్న ఆందోళన వుంటుంది. 

అది వేరు.. ఇది వేరు.. అనడానికి వీల్లేదు. ప్రభుత్వం వ్యూహాలెలా వున్నా, పోలీసుల తీరు కూడా అనుమానాస్పదంగా మారిందిక్కడ. భద్రతా కారణాలూ, ఇతరత్రా సాకులు చూపి, అసెంబ్లీకి ప్రతిపక్షాన్ని రానివ్వకుండా పోలీసులు చేస్తేనో.! ఏమో మరరి, చంద్రబాబు జమానాలో ఏదైనా జరగొచ్చు. ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి రానివ్వకపోవడమంటే.. తద్వారా చంద్రబాబు, సరికొత్త రికార్డ్‌ సృష్టించినట్లవుతుండండోయ్‌.!

Show comments