ఆత్మవంచన మాని క్షమాపణ చెప్పాలి!

కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్‌నా చేయడానికి జేఏసీ ఆధ్వర్యంలో నిరుద్యోగ ర్యాలీకి సంకల్పించడమూ, ర్యాలీని ఉక్కుపాదంతో అణచివేయడానికి ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతులు ఇవ్వకుండా దారుణంగా వ్యవహరించడమూ ఇవంతా ఒక ఎత్తు. సాధారణంగా ఇలాంటి ఉద్యమాల విషయంలో ప్రభుత్వాల ప్రతిస్పందన ఇంతే దారుణంగా ఉంటుందని సరిపెట్టుకోవచ్చు. కానీ... ర్యాలీ జరుగుతుందనే అంచనాతో.. జేఏసీ సారధి కోదండరాంను పోలీసులు అరెస్టు చేసిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. అమానుషంగా, దుర్మార్గంగా పోలీసులు ఆయన ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు అరెస్టు చేయడం అనేది.. దారుణమైన చర్యగా ఇప్పుడు పలువురు విమర్శిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యలుగా అభివర్ణించే ఆత్మవంచన ప్రకటనల్ని మానుకుని, సర్కారు బేషరతుగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. 

ఈ ఒక్క విషయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వీళ్లకు ఆదర్శం అనుకోవాలి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్రలను తొక్కేయడానికి ఏపీ సర్కారు, అక్కడి పోలీసులు ఎలా దారుణంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. ముద్రగడను ఆస్పత్రికి తరలించినప్పుడు వారి కుటుంబసభ్యులు, మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయి. పాదయాత్రలను అడ్డుకోవడంలో ముందుగానే అరెస్టులు చేసేస్తున్నారు. అచ్చం అదే మాదిరిగా ముందస్తు అరెస్టులకు పాల్పడిన తెలంగాణ పోలీసులు, తామేం తక్కువ తినలేదని చాటుకోడానికా అన్నట్లుగా, కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేయడం పరాకాష్ట.

కోదండరాం అరెస్టును సమర్థించుకోవడం వరకు అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ మాట ఇచ్చిన ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేశాడంటూ బొంకవచ్చు. అయితే కోదండరాం ను అరెస్టు చేసిన తీరు గురించి తనకు సమాచారం లేదంటూ తెలంగాణ హోం మంత్రి నాయని నరసింహారెడ్డి సెలవివ్వడం అనేది ఆత్మవంచనకు పరాకాష్ట. అరెస్టు చేసిన తర్వాతనైనా, ఆయనకు సరైన సమాచారం అందలేదంటే.. ఆ విషయం బయటకు చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాలి. 

అందుకే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ప్రతిధ్వనిస్తున్నాయి. ర్యాలీ భగ్నం, అరెస్టులు అన్నీ వెనక్కి వెళుతున్నాయి. అరెస్టులు జరిగిన తీరు గర్హనీయం అవుతోంది. కోదండరాం పట్ల వ్యవహరించిన తీరుకు బేషరతు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయ్. మరి కేసీఆర్ సర్కారు చెవులకు అవి చేరుతాయో లేదో?

Readmore!

Show comments