జూన్‌ నుంచి జనసేన 'షో'.!

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ తెరపై జనసేన పార్టీ 'షో' జూన్‌ నుంచి షురూ కాబోతోందట. కొత్తగా 'షో' ఏంటి.? అంటే, ఇప్పటిదాకా చూసిందంతా ట్రైలర్లు, టీజర్లు మాత్రమే. ఇక నుంచి పూర్తిస్థాయి సినిమా అన్నమాట. అదేనండీ, జనసేన పార్టీ జూన్‌ నుంచి పూర్తిస్థాయిలో బలోపేతమయ్యేందుకు చర్యలు చేపడ్తారట. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సెలవిచ్చారు. 

జనసేన పార్టీ ప్రారంభమయి నేటికి ముచ్చటగా మూడేళ్ళు. 2014 ఎన్నికల్లో బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి 'కొమ్ము కాసిన' జనసేనాధినేత పవన్‌కళ్యాణ్‌, 2019 ఎన్నికల్లో ఎవరికి 'కొమ్ము' కాస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. పార్టీ నిర్మాణం పూర్తయ్యాక, అప్పుడు ఆ విషయాన్ని వెల్లడిస్తారట. 2018 మార్చ్‌ నాటికి పార్టీ నిర్మాణం పూర్తవుతుందని పవన్‌కళ్యాణ్‌ సెలవిచ్చారు. 

మూడేళ్ళ క్రితం పుట్టిన పార్టీకి ఇంతవరకు సరైన నిర్మాణం లేకపోవడమే పెద్ద విచిత్రం. ప్రస్తుతానికి సినిమాల్లో బిజీగా వున్న పవన్‌కళ్యాణ్‌, సినిమాల నుంచి కాస్త గ్యాప్‌ తీసుకుంటారో.. సినిమాల్లో కొనసాగుతూనే పార్టీ నిర్మాణంపై దృష్టిపెడతారో, అసలు ఆయన మాటల్లో నిజమెంతో ప్రస్తుతానికైతే సస్పెన్సే. 

అన్నట్టు, పార్టీలో 60 శాతం యువతకు అవకాశం కల్పిస్తారట. ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి వున్న నాయకుల కోసం అన్వేషణ కొనసాగుతోందట. ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్ళడానికి 32 ముఖ్యమైన అంశాల్ని ఎంపిక చేసుకున్నారట. పార్టీకి మూడేళ్ళు పూర్తయిన సందర్బంగా మీడియా ముందుకొచ్చి పవన్‌కళ్యాణ్‌ ఇలా ఏవేవో చెప్పారు. పార్టీకి బలమైన కార్యకర్తలున్నారని కూడా చెప్పారాయన. కార్యకర్తలంటే సినీ అభిమానులని అర్థం చేసుకోవాలేమో. జనసేన పార్టీ వెబ్‌సైట్‌ని ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ ప్రారంభించారు. Readmore!

Show comments

Related Stories :