మోడీ తెలివికి.. బాబు అతి తెలివి మిక్సైంది మరి!

సాంకేతిక అభివృద్ధిలో మన కన్నా ఎన్నో మైళ్ల ముందున్న దేశాల్లో.. ప్రజల అక్షరాస్యతలోనూ, నగరీకరణలోనూ, ఇంటర్నెట్ టెక్నాలజీ వినియోగంలోనూ మనం ఇప్పుడప్పుడే అందుకోలేని స్థాయిలో ఉన్న దేశాల్లోనూ.. ఆర్థిక వ్యవహారాలు డిజటలైజ్ అయ్యింది అంతంత మాత్రమే! అమెరికా, చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రిటన్, డెన్మార్క్… తదితర దేశాల్లో కూడా డిజిటల్ కరెన్సీ వినియోగం అంతంత మాత్రమే! ఇది వాస్తవం.

అయితే కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్టుగా.. మోడీ మహనీయుడు తీసుకున్న నిర్ణయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి డిజిటల్ కరెన్సీ దిశగా తీసుకొచ్చారు! నగదు రహిత లావాదేవీలు అన్నారు. అలా అయితేనే దేశం అభివృద్ధి అన్నారు, లేకపోతే  ఇంతే అన్నారు. మరి అభివృద్ధి చెందిన దేశాల్లో.. నగదు రహిత లావాదేవీల శాతం ఎంత? ఇంటర్నెట్ సేవలు అంతంత మాత్రంగా ఉన్న, స్మార్ట్ ఫోన్లు – కంప్యూటర్లు వాడే అవకాశం, అవగాహన లేని మన ప్రజలపై నగదు రహితం అంటూ రుద్దడం ఎంత వరకూ సబబు? అనే ప్రాక్టికాలిటీ గురించి మోడీ ఆలోచించలేదు.

అతని కన్నా ఘనుడు అచంట మల్లన్న.. అన్నట్టుగా మోడీనే అనుకుంటే, చంద్రబాబు జనాలను హింసించడంలో నాలుగాకులు ఎక్కువ నమిలిన ఘనుడు. ఈయన ఏకంగా పెన్షన్లు అందుకునే వృద్ధుల మీద, రేషన్ సరుకులు తీసుకునే పేదల మీద తన ప్రతాపాన్ని చూపించాడు.

ఆర్బీఐ వాళ్లు ముందే చెప్పారు.. పెన్షన్ మొత్తాలకు అవసరమైన నోట్లను అందిస్తాం, వృద్ధాప్య పెన్షన్ల కోసం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ ప్రత్యేకంగా కరెన్సీని అందిస్తాం.. అని వారు ఆదిలోనే ప్రకటించారు. అన్ని రాష్ట్రాలూ  ఆ మేరకు ఆర్బీఐ నుంచి కరెన్సీని తీసుకున్నాయి. అయితే ఏపీ సీఎం మాత్రం వద్దన్నారు! నేను సీఎంగా ఉన్న రాష్ట్రంలో నోట్లు పంచడం ఏమిటి.. బ్యాంకు ఖాతాల్లో వేసేస్తాం… అంతా డిజిటల్ ఇక్కడ అన్నారు!

అంతేనా.. రేషన్ సరకులు కూడా నగదు రహితమే.. అంటూ వైట్ కార్డ్ హోల్డర్లనూ బ్యాంకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే..వృద్ధాప్య పెన్షన్లు పొందే వృద్ధుల్లో ఎంతమందికి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి? ఎంతమంది  రేషన్ కార్డు హోల్డర్లకు బ్యాంకు ఖాతాలున్నాయి?  ఈ పేద ప్రజల్లో ఎంతమంది నగదు రహిత లావాదేవీలు చేయగలరు? అనే బేసిక్స్ ను చంద్రన్న పరిగణనలోకి తీసుకోలేదు!

ఎవ్వడు ఎలాగైనా చావని… ఎవరు ఎన్ని బాధలైనా పడని.. ఉన్నఫలంగా అంతా నగదురహితం అయిపోవాలంతే! ఇదీ ఈ పాలకుల విజన్. దేశం మోడీ విజన్ ను తట్టుకోలేక బావురుమంటుంటే.. ఏపీకి బాబు తోడయ్యాడు. దీంతో అటు వృద్ధులు, ఇటు రేషన్ బియ్యం కోసం క్యూల్లో వేచి చూస్తున్న వాళ్లు.. బ్యాంకుల ముందు కు చేరి, ఏం జరుగుతోందో అర్థం కాని గందరగోళంలో పడి.. కొట్టుమిట్టాడుతున్నారు.

ఆఖరికి అనుకూల మీడియా కూడా రేషన్ కార్డు హోల్డర్ల, వితంతు-వృద్ధాప్య పెన్షన్ల కష్టాలను పతాక శీర్షికల్లో ప్రచురించింది. ఇల్లైనా అలక్కుండానే చంద్రబాబు పండగ చేయబోయిన విధానాన్ని అంగీకరించింది. ఈ పాలకుల విజన్  ఫలితాలు ఎలా ఉన్నాయో చెప్పడానికి ఇక ఏ రుజువులూ అక్కర్లా!

Show comments