జయ క్యారెక్టర్ ను మణిరత్నం డీల్ చేయలేకపోయాడా!

సినిమా ఆరంభంలోనేమో.. ఈ సినిమా ఎవరినీ ఉద్దేశించినది కాదు, కేవలం కల్పిత కథ మాత్రమే అని స్పష్టం చేస్తారు కానీ, మణిరత్నం రూపొందించిన ‘ఇద్దరు’ తమిళ సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఎంజీఆర్, కరుణానిధిల జీవితాల ఆధారంగా రూపొందించినదే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళ రాజకీయాల్లో.. కరుణ, ఎంజీఆర్ ల ప్రస్థానాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ సినిమాను చూస్తే చాలు. డీఎంకే ప్రస్థానం, అన్నాడీఎంకే ఆవిర్భావం.. కరుణ, ఎంజీఆర్ ల మధ్య స్నేహం అన్నీ అర్థం అవుతాయి.

వివాదాలు రేగకుండా, విడుదల విషయంలో ప్రతిష్టంభనను తొలగించుకోవడానికి మణిరత్నం ‘ఎవరినీ ఉద్దేశించినది కాదు..’ అనే ట్యాగ్ తగిలించేశాడు.

కరుణానిధి, ఎంజీఆర్ ల బలాలను బలాలుగా చూపుతూ, బలహీనతలను కూడా బలాలుగా చూపుతూ.. పాలిష్ చేసిన సినిమా ‘ఇద్దరు’. ప్రకాష్ రాజ్ పాత్ర కరుణను రెప్రజెంట్ చేస్తే, మోహన్ లాల్ చేసిన ఆనందన్ పాత్ర ఎంజీఆర్ ను ఉద్దేశించినదే అనే విషయం జగమెరిగినదే.
 
డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మరణం, అనంతర పరిణామాల్లో కరుణకు బాధ్యతల అప్పగింత, కరుణ- ఎంజీఆర్ ల మధ్య ఇగో క్లాషెష్.. ఎంజీఆర్ అన్నాదురైను స్మరిస్తూ ‘అన్నా-డీఎంకే’ ను ఏర్పాటు చేసుకోవడం.. వంటి పరిణామాలన్నీ సినిమాలో ఉంటాయి. అలాగే సినీ రచయితగా కరుణానిధి, సినీ స్టార్ గా ఎంజీఆర్ ల ప్రస్తావన కూడా ఉంటుంది. 

మరి ఈ సంగతులిలా ఉంటే.. వీరి వ్యక్తిగత జీవితాల గురించి కూడా సదరు సినిమాలో ప్రస్తావన ఉంటుంది. కరుణానిధి బహుభార్యలను కలిగిన వ్యక్తి. సినిమాలో ఆ విషయాన్ని స్పష్టంగానే చూపిస్తారు. ఇక ఎంజీఆర్ వ్యక్తిగతానికి వస్తే.. జానకీ ని వివాహం చేసుకోవడానికి మునుపు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య మరణించాకా రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్య మరణించాకా వీఎన్ జానకిని వివాహం చేసుకున్నారు.

ఇక సదరు సినిమాలో ఎంజీఆర్ రాజకీయ శిష్యురాలు, సహనటి.. జయలలిత ప్రస్తావన కూడా పరోక్షంగా ఉండనే ఉంది. మరణించిన ఎంజీఆర్ భార్య పాత్ర ఒకదాన్ని, జయలలిత పాత్రనూ.. ఐశ్వర్యే చేసిందనుకోవాలి. మరణించిన భార్య పోలికల్లోనే ఉండటంతో కల్పన(ఐశ్వర్య) అనే హీరోయిన్ కు ఆనందన్ దగ్గర అవుతాడు. అయితే వీరిది ప్లేటోనిక్ లవ్ గా చూపించాడు మణిరత్నం! అంటే.. ఆ దర్శకుడి వెర్షన్ ప్రకారం.. ఎంజీఆర్- జయల మధ్య కూడా అలాంటి ప్రేమే నడిచిందనుకోవాలి.

అయితే.. వాస్తవానికి సినిమాకూ ముఖ్యమైన తేడా ఉంది. ఆనందన్ మనసుపడే ఆ హీరోయిన్ పాత్రకు ఒక ముగింపును ఇచ్చారు. యాక్సిడెంట్ లో ఆమె మరణించినట్టుగా చూపించారు! ఆ హీరోయిన్ సామాజిక సేవ వైపు వచ్చినట్టుగా.. రాజకీయంగా సక్సెస్ అయిన ఆనందన్ కు తిరిగి దగ్గర అయ్యే క్రమంలో జరిగిన ప్రమాదంలో ఆమె మరణించినట్టుగా చూపించారు. ఐశ్వర్య చేసిన కల్పన అనే పాత్ర కచ్చితంగా జయలలితను ఉద్దేశించినదే అని చెప్పాలి. అయితే మరీ యథాతథంగా చూపితే.. వివాదాలు పెద్దదవుతాయనే ఉద్దేశంతో జయ పాత్రకు ఆ విధంగా ముగింపునిచ్చినట్టున్నాడు మణిరత్నం!

Show comments