గ్రాఫిక్స్ ప్రధాన చిత్రాలు వరుసగా తీస్తూ విపరీతమైన హార్డ్ వర్క్ చేస్తోన్న రాజమౌళి తదుపరి చేసే రెండు చిత్రాలని గ్రాఫిక్స్ అవసరం లేకుండా చేద్దామని అనుకుంటున్నాడు. ఈ సంగతి 'బాహుబలి' ట్రెయిలర్ రిలీజ్ సందర్భంగా రాజమౌళి చెప్పాడు. అయితే నిర్మాత శోభు ఆ మాటకి అడ్డం పడుతూ ఆయనెప్పుడూ సింపుల్‌గానే చేస్తానంటాడు కానీ అది వేరేలా షేప్ తీసుకుంటుందని జోక్ చేసాడు.
హాలీవుడ్ దర్శకులనే తీసుకుంటే ఎప్పుడూ ఒకే రకం సినిమాలకి కట్టుబడరు. ఒక భారీ బడ్జెట్ చిత్రం చేసిన తర్వాత లో బడ్జెట్ థ్రిల్లర్ లేదా డ్రామా తీస్తూ తమ వెర్సటాలిటీ చూపిస్తుంటారు. రాజమౌళి కూడా మగధీర తర్వాత అలాంటి వైవిధ్యానికే ప్రాధాన్యమిచ్చాడు. మగధీర తర్వాత మర్యాద రామన్నలాంటి కామెడీ చిత్రం, ఈగ లాంటి ప్రయోగం చేసాడు.
అయితే బాహుబలితో రాజమౌళి జాతీయ స్థాయికి ఎదిగిపోయాడు. ఇప్పుడతని సినిమా కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలో సాదా సీదా సినిమా చేస్తానంటే కుదరదు. అతడి నుంచి జనం అద్భుతాలు ఆశిస్తోన్న సమయంలో రాజమౌళి సాధారణ చిత్రాలు చేయకూడదు. గ్రాఫిక్స్ వున్నా లేకపోయినా కానీ రిలీజ్ అవుతోన్న సినిమాల మధ్య ప్రత్యేకత చాటుకునేది చేసి తీరాలి. రెండు నెలల విరామం కోరుకుంటోన్న రాజమౌళి ఫైనల్‌గా నెక్స్‌ట్ ఏది చేస్తే బెస్ట్ అని ఫిక్స్ అవుతాడో మరి.