మేధావులు గతాన్ని తవ్వుతోంటే.. భవిష్యత్తు చీకటే!

గతం గురించిన జ్ఞానం లేకుండా, భవిష్యత్తులోకి వేసే అడుగులు సవ్యంగా సాగవు. కాబట్టి.. సుస్థిరమైన భవిష్యత్తు కోసం గతాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ.. భవిష్యత్తు నిర్మాణం గురించి నామమాత్రపు చర్చ లేకుండా, ఆలోచన కలిగించే ప్రయత్నం లేకుండా.. మేధావులు గతాన్ని మాత్రం తవ్వుకుంటూ బతికేస్తే ఎలాగ? కేవలం గతం తవ్వుకోవడంవలో మేధావులు కాలం గడిపేస్తే.. జాతికి నష్టమే తప్ప కొత్తగా జరిగే మేలు ఉండదు. 

..ఈ ఉపోద్ఘాతం మొత్తం.. ఇవాళ ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ ఆవిష్కరించబోతున్న 'విభజన కథ' అనే పుస్తకం గురించి. ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ రాష్ట్ర విభజన జరిగిన సమయానికి స్వయంగా కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని చిత్తశుద్ధితో ప్రయత్నించిన, నాటకాలు లేకుండా, తన వంతు ప్రయత్నం చేసిన కొద్దిమంది అప్పటి కాంగ్రెస్‌ ఎంపీల్లో ఆయన ఒకరు. రాష్ట్రం సమైక్యంగా మాత్రమే ఉండడం ఏ రకంగా న్యాయసమ్మతమో ఆయన అంశాల వారీగా వివరించారు. 

ఒకవైపు తెరాస లేదా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న మేధావులు ఆంధ్రతో కలిసి ఉండడం వలన తమకు ఎలాంటి నష్టం జరిగిందనే విషయంలో అంశాల వారీగా వివరిస్తూ ఉంటే.. ఆ పాయింట్లకు అంతకంటె సమర్థమైన తర్కబద్ధమైన అంశాలతో.. ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ కౌంటర్లు ఇచ్చారు. ఆంధ్రప్రాంతం చాలా నష్టపోయి.. హైదరాబాదులో వలసజీవితాల్లో స్థిరపడిందనే అంశాల్ని తెరపైకి తెచ్చారు. అయితే అదంతా గతించిపోయిన అధ్యాయం. విభజన తర్వాత.. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి ఆయన ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. 
అమరావతి గురించి ఆయన ఇటీవలే ఒక పుస్తకం విడుదల చేశారు. ఇప్పుడు విభజన కథ అంటూ ఓ సరికొత్త పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. దాని పేరు 'విభజన కథ'! అప్పటి పరిణామాలను దగ్గరుండి గమనించిన ప్రత్యక్షసాక్షిగా, అరుణ్‌కుమార్‌ కథనానికి సాధికారత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ఇప్పుడు ఆ చీకటి గతాన్ని తవ్వుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఒనగూరే మంచి, మేలు ఏమిటి? 'ఉండవిల్లి అరుణ్‌కుమార్‌ మంచి పుస్తకం రాశారు' అని ఆయన ప్రొఫైల్‌ లో జత అవుతుంది తప్ప రాష్ట్రానికి జరిగేదేం లేదు. 

నిజానికి ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు పదేళ్ల పాటు ప్రత్యేకహోదా ఇస్తాం అని ఎన్నికల ముందు చెప్పిన భాజపా మోసం చేసింది. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న పార్టీకి తిరుగులేని నాయకుడిగా తన హవా నడిపిస్తున్న నరేంద్రమోదీ మీద ఒత్తిడి తేగల స్థితిలో గానీ, గట్టిగా ఆయనకు సలహా చెప్పగల స్థితిలో గానీ వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు వంటి ఎవ్వరూ లేకపోవడం రాష్ట్రం చేసుకున్న ఖర్మ. రాష్ట్రంలో ఉన్న విపక్షాలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కాంగ్రెస్‌, తాజాగా జనసేన అందరూ కూడా.. ప్రత్యేకహోదా ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అనే సత్యం తెలిసినప్పటికీ.. ఏదో మొక్కుబడిగా తమ వాటి పోరాటాల్ని నడిపిస్తున్నారు. 
ఇలాంటి నేపథ్యంలో ఉండవిల్లి లాంటి మేధావులు, రాష్ట్రం బాగుపడాలంటే.. భవిష్యత్తు నిర్మాణం కోసం ఎలాంటి ఆలోచనలు ప్రజల్లో చర్చకు రావాలో అలాంటి అంశాలపై పుస్తకాలు రాస్తే బాగుంటుంది. నేటి యువతరం ఏం చేయాలో.. ప్రజల కర్తవ్యం ఎలా ఉండాలో సూచించే ప్రయత్నం జరగాలి. అంతే తప్ప.. విభజన ఎలా జరిగింది.. ఆ పాపానికి కర్తలెవరు? అనాథ రాష్ట్రం అవతరించడానికి వంచించిన విటులెవ్వరు? వంటి వ్యర్థ చర్చను కొనసాగించకపోతే మంచిది! 

- కపిలముని 

kapilamuni.a@gmail.com

Show comments