రోకలి తలకు చుట్టమంటున్న చంద్రబాబు

వెనకటికి ఎవడో ప్రబుద్ధుడు వెర్రి ముదిరితే రోకలితలకు చుట్టమన్నాడని సామెత! అంటే దూకుడుగా అనిపిస్తుంది గానీ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు కూడా అంతకంటె భిన్నంగా ఎంతమాత్రమూ కనిపించడం లేదు. కాకపోతే మరేంటి.. ఆయన ఏ దేశానికి వెళితే.. ఆ దేశపు భాషను తెలుగు వాళ్లకు నేర్పించేస్తానంటూ వాగ్దానాలు చేసి వచ్చేయడమేనా? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

నిన్నటిదాకా రష్యా పర్యటనలో ఉన్న చంద్రబాబునాయుడు అక్కడి నాయకులకు ఓ హామీ ఇచ్చేశారు. రష్యాతో ముందు తరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కూడా మరింత దృఢమైన బంధం ఏర్పడడం కోసం.. మన రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో రష్యన్‌ భాషను బోధించేకోర్సును ఏర్పాటు చేస్తానంటూ చంద్రబాబు వారికి హామీఇచ్చేశారు. అంటే ఇప్పుడు చంద్రబాబునాయుడు రష్యన్‌ టూరు వెళ్లాడు గనుక.. తెలుగు ప్రజలంతా రష్యన్‌ భాష నేర్చుకోవాలన్నమాట. గతంలో ఇదే తరహా హామీని ఆయన జపాన్‌కు కూడా ఇచ్చేశారు. ఇక్కడి యూనివర్సిటీల్లో జపాన్‌ భాషను బోధించే కోర్సులను కూడా ప్రారంభించేశారు. ఇప్పుడు రష్యన్‌ వంతు వచ్చింది. 

చంద్రబాబు సెయింట్‌ పీటర్స్‌బుర్గ్‌ పర్యటన నేపథ్యంలో.. అక్కడి నాయకులు భారత్‌ తో తమ అనుబంధం గురించి చెప్పినదెల్లా..రవీంద్రనాధ్‌ టాగూర్‌ పేరు, ముంబాయి నగరంమాత్రమే. అక్కడికేదో.. విజయవాడ గురించి చెప్పినంతగా చంద్రబాబు మురిసిపోయారు. వారు ఇచ్చిన హామీ మొత్తంకలిసి బీచ్‌ టూరిజం అభివృద్ధి చేస్తాం అని మాత్రమే. చంద్రబాబు మాత్రం ఐటీ మరియు ఫార్మా రంగాలలో వారి దేశం పురోగతి సాధించడానికి ఏపీ సహకరిస్తుందని.. (ఈ రంగాల్లో మనమే మెరుగ్గా ఉన్నాం కనుక) వారికి హామీ ఇచ్చారు. సరే పరస్పర సహకారం ఇచ్చిపుచ్చుకోవడం మంచిదే. కాదనలేం. 

కానీ, చంద్రబాబులోని భావదారిద్య్రం ఎలాంటి వెర్రితలలు వేస్తున్నదంటే.. వారి దేశం బాగుపడడానికి మనం ఐటీ , ఫార్మా సహకారం అందిస్తాం. అంటే మనం సహకరిస్తే.. వారు బాగుపడతారు. మంచిదే. కానీ.. అందుకు మనమే వారి భాషను నేర్చుకోవడానికి ఎగబడతాం..! ఏం చంద్రబాబునాయుడు.. రష్యాలో తెలుగు నేర్పే ఒక విభాగాన్ని ప్రారంభించాల్సిందిగా అక్కడి వారిని అడిగే ధైర్యం ఎందుకు చేయలేకపోయారు? మా సహకారం మీకు అవసరం గనుక.. మా భాష మీరు నేర్చుకోండి అని ఎందుకు చెప్పలేకపోయారు? మొత్తానికి ఈరకంగా చంద్రబాబు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, భౌషా గౌరవాన్ని విదేశాల్లో తాకట్టు పెట్టేస్తున్నారు అని అర్థమవుతోంది. 

నిన్నటిదాకా జపాన్‌ పాట, జపనీస్‌ నేర్చుకునే ఆట ఆడారు. రాజధాని నిర్మాణం విషయంలో ఇప్పుడు జపనీస్‌ పాత్ర ఏమిటో అస్సలు వినిపించడం లేదు. ఇప్పుడిక రష్యన్‌ గీతాలు ఆలపిస్తున్నారు. చంద్రబాబుకు కూడా మోడీలాగా దేశాలు తిరిగే ముచ్చట ఉంటే తీర్చుకోవచ్చు.. కానీ.. ఆ భాషలన్నిటినీ తీసుకువచ్చి మనమీద రుద్దుతా అంటూ అక్కడ వాగ్దానాలు చేయడం ఎందుకు? ఏ రోటికాడ ఆ పాట పాడడం రాజకీయ నాయకులకు కొత్త కాదు. కానీ.. ఇలాంటి విషయాల్లో అద తగదని ఆయన తెలుసుకోవాలి. 

Show comments