'దేశం' గొంతులో ఫిరాయింపు వెలక్కాయ

త్వరలో జరగబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, వేటిపై పట్టుపట్టాలన్నదానిపై  ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ అయిడియాకు వచ్చింది.  తాజాగా జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఈమేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రతి సారి పార్లమెంటులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, బాబు అవినీతి, విభజన చట్టం హామీల వంటి వాటిపై సభలో నిలదీయడం, వాటి కోసం పట్టుపట్టడం వైకాపా చేస్తున్న పని. ఈ సారి వాటిలోకి మరో ముఖ్యమైన అంశం వచ్చి చేరింది. 

ఇది వైకాపాకే కాదు దేశంలోని అన్ని పార్టీలకు అతి ముఖ్యమైనదే. పైగా బీజేపీ కూడా ఈ విషయంలో వైకాపాకే మద్దతిచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే టీడీపీ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. వైకాపా ఈ సారి తన ఎజెండాలో కొత్తగా చేర్చిన అంశం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లోటు పాట్లు. దీనిలో లోపాలున్నాయి, వాటిని సవరించాలి. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన వారు మరో పార్టీ మారితే పదవికి, పార్టీకి రాజీనామా చేసి మారాలి, లేదంటే వారి పదవిని రద్దుచేయాలి అన్నదే ప్రధానాంశం. 

దీనిపై ఇటీవల తెలుగురాష్ట్రాల్లో పర్యటించిన బీజేపీ జాతీయాధ్యక్ష్యుడు అమిత్ షా కూడా స్పందించారు. తెలుగురాష్ట్రాల్లో ఇంత ఘోరంగా పార్టీలు మారుతున్నారు, ఇది ప్రజాస్వామ్యవ్యవస్థకే పెద్ద ప్రమాదం అంటూ వాఖ్యానించారు. అయితే దీనిపై భాజపా పార్లమెంటులో ఎలా స్పందిస్తున్నది చూడాలి. ఇలా అనుకోవడానికి సరైన కారణాలే వున్నాయి. భాజపా మిత్రపక్షం తెలుగుదేశం కాబట్టి. అది కాకుండా భాజపా కూడా అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి తరహా పనికే పాల్పడి ఎదురుదెబ్బ తిన్నది. బీజేపీ పరిస్థితి పక్కన బెడితే టీడీపీ వైఖరేంటన్నదే ఇప్పుడు ప్రధానం. 

పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాల వల్ల అది ఏపీలో లబ్దిపొందితే తెలంగాణలో అంత కంటే ఎక్కువగా నష్టపోయింది. తెలంగాణను దృష్టిలో పెట్టుకుని వైకాపా ప్రవేశపెట్టబోయే పార్టీ ఫిరాయింపుల చట్టంలోని మార్పుల ప్రైవేటు బిల్లుకు ఆమోదం తెలుపుతుందా, అది ఏపీలో తనపై దెబ్బతీయడానికే వైకాపా ఆవిషయంలో ముందుకు పోతున్నందుకు వ్యతిరేకిస్తుందా అన్నది చూడాలి. ఈ విషయంలో ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోయినా దాని నిర్ణయం ఎలా ఉంటుందనేది దాదాపుగా అందరూ ఊహించేదే. 

భాజపా, తేదేపా కలిసి గత సమావేశంలో కెవిపి ప్రయివేటు బిల్లు రాకుండానే సమావేశాలు ముగిసేలా చేసాయి.మరి ఈసారి కూడా అలాంటి వ్యవహారామే చేసే అవకాశం వుంది. కానీ వైకాపా ఒక విషయంలో విజయం సాధిస్తుంది. సమస్యను జాతీయ మీడియా దృష్టికి తీసుకురావడం అన్నదే ఆ విజయం. వైకాపా పార్లమెంటులో ఎంత లొల్లి చేసినా టీడీపీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుంది. వాటం చూసి పెదవి విప్పుతుంది, లేదా మౌనంగానే ఉంటుంది. దీని వరకు ఓకే... కాని వైకాపా విభజన హామీలపై పట్టుపట్టాలని డిసైడ్ అయింది. ఇది టీడీపీకి కూడా అత్యంత ముఖ్యమైనదే. 

విశాఖలో రైల్వేజోన్, హోదా వంటి ఎన్నో అంశాలపై వైకాపా పార్లమెంట్లో ప్రస్తావించబోతోంది. వీటి విషయంలో మాత్రం టీడీపీ బోనులో నిలబెడక తప్పదు. కారణం అది కూడా అవి కావాలనాల్సిందే. ఇప్పుడు అదే పనిచేస్తోంది. కాని సభాముఖంగా వీటి విషయంలో తన మిత్రపక్షంతో పోరాడుతుందా, లేక వైకాపాకు మద్దతుగా నిలుస్తుందా.. ఈ రెండింటిలో ఏదైనా సరే టీడీపీకి ఇబ్బందికరమే. అందుకే టీడీపీ వర్షాకాలం సమావేశాల్లో ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.

Show comments