పవన్‌కళ్యాణ్‌ స్పీడెంత.!

ఎట్టకేలకు బాలారిష్టాలు దాటి పవన్‌కళ్యాణ్‌ తాజా చిత్రం 'కాటమరాయుడు' పట్టాలెక్కింది. హమ్మయ్య.. అని పవన్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. నిజమే మరి, ఎప్పుడో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళాల్సి వుంది. కానీ, పవన్‌కళ్యాణ్‌ కన్‌ఫ్యూజన్‌తో సినిమా ముందుకీ వెనక్కీ అయ్యింది. మధ్యలో దర్శకుడు కూడా మారిపోయాడు. అఫ్‌కోర్స్‌ కథ కూడా మారిపోయిందనే ప్రచారం జరుగుతోందనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, ఒక్కసారి సెట్స్‌ మీదకు వెళ్ళాక సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందని నిర్మాత శరద్‌ మరార్‌, దర్శకుడు కిషోర్‌ కుమార్‌ పార్దసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, అక్కడున్నది పవన్‌కళ్యాణ్‌. అటు రాజకీయాల్లోనూ ఓ కాలు పెట్టిన పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీని విస్తరించే పనుల్లో బిజీగా వున్నారు. దాంతో, 'కాటమరాయుడు' విషయంలో పవన్‌ చూపించబోయే స్పీడ్‌పై అనుమానాలు సహజమే. 

ఇదిలా వుంటే, డిసెంబర్‌లో పవన్‌కళ్యాణ్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌ మీదకు వెళుతుందనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పవన్‌కళ్యాణ్‌తో సినిమా నిర్మించే విషయంలో దాసరి నారాయణరావు కూడా తొందరపడ్తున్న విషయం విదితమే. ఓ పక్క 'కాటమరాయుడు' షూటింగ్‌లో పాల్గొనాలి, ఇంకో వైపు రాజకీయాలు చూసుకోవాలి. వీటితోపాటు త్రివిక్రమ్‌ సినిమా, దాసరి సినిమా గురించి ఆలోచించాలి, వాటికి సన్నద్ధమవ్వాలి. 

ఇంత కథ వుంది మరి. పవన్‌కళ్యాణ్‌, ఇప్పుడు చూపించబోయే స్పీడ్‌ మీదనే.. పవన్‌ 2019లోపు ఎన్ని సినిమాలు చేయగలరు.? (ఆ తర్వాత చేసే అవకాశం తక్కువేనని హింట్‌ ఇచ్చేశారాయన) అన్న ప్రశ్నకు సమాధానం ఆధారపడి వుంటుంది.

Show comments