జయప్రదంగా యూపీకి అంకితం....!

సామాన్యుల జీవితాలే కావొచ్చు, సెలబ్రిటీల జీవితాలే కావొచ్చు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. అనుకోనివిధంగా ముఖచిత్రాలు మారిపోతుంటాయి. సామాన్యుల జీవితాల్లోని మలుపులు తెర మరుగున ఉండిపోతే సెలబ్రిటీల జీవితాల్లోని ముఖ్యంగా సినిమా తారల లైఫ్‌లోని ఘటనలు వార్తలకెక్కుతాయి. సినిమా తారల జీవితాల్లో ఆసక్తికరమైంది ఒకప్పటి సూపర్‌స్టార్‌ జయప్రద లైఫ్‌. చాలా అందమైన తారగా ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్‌ రే ప్రశంసలు పొందిన ఈ రాజమండ్రి హీరోయిన్‌ తన జీవితాన్ని పూర్తిగా ఉత్తర ప్రదేశ్‌కు అంకితం చేసింది. 

ఆమె రాజకీయ అరంగేట్రం తెలుగు రాజకీయాల ద్వారా జరిగినా యూపీ రాజకీయాల్లో జయకేతనం ఎగరేసి పూర్తిగా ఆ రాష్ట్ర రాజకీయ నాయకురాలైపోయింది. దీర్ఘకాలం ఎంపీగా పనిచేసి యూపీ రాజకీయాల్లో అనేక ఆటుపోటు, అవమానాలు ఎదుర్కొన్న జయప్రదకు మళ్లీ మంచి రోజులు రాబోతున్న సంకేతాలు కనబడుతున్నాయి. తాజాగా ఆమెకు అఖిలేష్‌ యాదవ్‌ సర్కారులో కేబినెట్‌ హోదా ఉన్న పదవి దక్కింది. ఒకప్పుడు ఇదే పార్టీ నుంచి తన రాజకీయ గురువు అమర్‌సింగ్‌తోపాటు బహిష్కరణకు గురైన  జయప్రద మళ్లీ అదే పార్టీలో గుర్తింపు పొందడం విశేషమే. ఇంతకూ ఆమెకు దక్కిన పదవి ఏమిటి? యూపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. 

ఈ సంస్థకు ఛైర్మన్‌గా ప్రముఖ కవి గోపాల్‌దాస్‌ నీరజ్‌ వ్యవహరిస్తున్నారు. జయప్రదకు ఈ పదవి రావడానికి వెనుక గురువు అమర్‌సింగ్‌ ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జయప్రద తనకు సన్నిహితురాలని, పార్టీలో ఆమెకు అవమానం జరగుతోందని, దాన్ని సరిదిద్దకపోతే (పదవి ఇవ్వకపోతే అని అర్థం) తాను పార్టీ నుంచి వెళ్లిపోతానని ఆయన హెచ్చరించారట...! దీంతో అఖిలేష్‌ సర్కారు కేబినెట్‌ హోదా ఉన్న పదవి ఇచ్చి అమర్‌సింగ్‌ను సంతృప్తిపరిచింది. జయప్రద మళ్లీ నెమ్మదిగా రాజకీయాల్లో బిజీ అయినా ఆశ్చర్యం లేదు. గతంలో అమర్‌సింగ్‌కు ఎస్‌పీ అధ్యక్షుడు ములాయంసింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనతో పాటు శిష్యురాలు జయప్రదను కూడా 2010లో పార్టీ నుంచి బహిష్కరించారు. 

ఆ తరువాత అమర్‌సింగ్‌ సొంత కుంపటి పెట్టుకున్నా అది వెలగలేదు. తరువాత ఆర్‌ఎల్‌డీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసినా జయప్రదకు పరాజయం తప్పలేదు.  మళ్లీ ఏదోవిధంగా రాజీపడి సొంత పార్టీకి చేరుకున్నారు. జయప్రదకు పదవి ఇవ్వడంతో రీఎంట్రీ తరువాత కూడా అమర్‌సింగ్‌ తన పవర్‌ తగ్గలేదని నిరూపించుకున్నారు. గత ఏడాది జయప్రదకు ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఇందుకు కారణం ఆమె శత్రువు ఆజంఖాన్‌. గవర్నర్‌ కోటాలో తొమ్మిదిమంది ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అఖిలేష్‌ తయారుచేశారు. అందులో ఈమె పేరూ ఉంది. కాని ఆజంఖాన్‌ ఆమెకు ససేమిరా ఎమ్మెల్సీ ఇవ్వకూడదని పట్టుబట్టారు. 

అఖిలేష్‌, ములాయం ఎంతగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఇప్పుడు అమర్‌సింగ్‌ పట్టుదల గెలవడంతో పదవి దక్కింది. ఒకదశలో జయప్రద తెలుగు రాజకీయాల్లోకి (ఉమ్మడి రాష్ట్రంలో) వస్తారనే సంకేతాలు వచ్చాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈవిధమైన వార్తలొచ్చాయి. తనకు సొంత ఊరైన రాజమండ్రి నుంచి పోటీ చేయాలనుందని కూడా ఒకసారి ఆమె చెప్పారు. మరోసారి టీడీపీలో చేరతారనే పుకార్లు వచ్చాయి. ఆమె టీడీపీ పట్ల సానుకూలంగా మాట్లాడటంతో మళ్లీ ఆ పార్టీలో చేరతారని అనుకున్నారు. 

కారణాలేవైనా ఆమె ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాలకే అంకితమయ్యారు. ఆ తరువాత ఎప్పుడూ (రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా) తెలుగు రాజకీయాల పట్ల ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. ఇక ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. కాలం కలిసొస్తే యూపీ రాజకీయాల్లోనే కీలక పాత్ర పోషించి ఏదో ఒక చట్టసభకు ఎన్నిక కావొచ్చేమో...!

Show comments