బాబు ఓట్ బ్యాంక్ గల్లంతవుతోంది?

తప్పదు..ఇలా కాదు, అంత ఉత్తిదే అనుకుంటే, బాబు కైనా, ఆయన అభిమానులకైనా, ఆయన వర్గాభిమానులకైనా ఆత్మవంచన తప్ప వేరొకటి కాదు. మొన్నటి హోరా హోరీ ఎన్నికల్లో తెలుగుదేశం,వైకాపాల మధ్య ఓట్ల శాతం తేడా ఏ మేరకు అన్నది అందరికీ తెలిసిందే. అతి తక్కువ మార్జిన్ తో గట్టెక్కేసింది తెలుగుదేశం పార్టీ. 

ఈ మూడేళ్లలో చంద్రబాబు చేసిందానికి ఫిదా అయిపోయి ఓట్ల శాతం పెరిగిపోయి వుంటుందీ అని ఆయన, ఆయన వర్గీయులు అనుకుంటున్నారు. కానీ మొన్న పడిన ఓట్లకు గండి పడితోందని గమనించుకోవడం లేదు. రాష్ట్రంలోని ఓటర్లలో కీలకమైన ఉద్యోగ వర్గం ఇప్పుడు బాబుపై చాలా అసంతృప్తిగా వుందన్నది వాస్తవం. ఏ అశోక్ బాబు అయితే తెలివిగా, గంపగుత్తగా ఉద్యోగులను తీసుకెళ్లి తెలుగుదేశం మద్దతుగా నిలబెట్టారో, అలాంటి వ్యక్తినే ఇప్పుడు ఉద్యోగులు పక్కన పెడుతున్నారు. రెండు విడతలుగా డిఎ లేదు. మెడికల్ స్కీమ్ అమలు కావడం లేదు. చాలా మందికి ఎరియర్స్ రాలేదు. ఇలా ఉద్యోగుల సమస్యలు ఒకటి కాదు.

ఇక ఏ అంగన్ వాడీ మహిళలయితే బాబుకు అండగా వున్నారో, వాళ్లు ఇప్పుడు ఆయన పేరు చెబితేనే మండి పడుతున్నారు. ఆరు నెలల బట్టి చాలా మంది అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు లేవు. పైగా గతంలో అంగన్ వాడీలు తమ సమస్యలపై ప్రదర్శన చేస్తే గుర్రాలతో తొక్కించారు. ఇది వారి మదిలో బలంగా నాటుకుపోయింది. 

రైతు రుణమాఫీ, పలెట్లూళ్లలో కానరాని పక్కా ఇళ్ల స్కీము లు అంతంత మాత్రంగా వున్నాయి. కేంద్రం ఇస్తున్న నిధులు మినహా పంచాయతీలకు నిధులు అందడం లేదు. మొన్నటి ఎన్నికల్లో బాబు పక్కన నిల్చున్న కాపులు ఇప్పుడు దూరం జరుగుతున్నారు. ముద్రగడ విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న వైఖరి, తుని సంఘటన తరువాత కాపుల పై సాగించిన కేసుల వ్యవహారం వుండనే వుంది. 

వీటన్నింటికి తోడు యువతను ఇప్పుడు దూరం చేసుకుంటున్నారు. మిగిలిన జనాలను ఎలాగైనా మభ్య పెట్టవచ్చు. ఎప్పుడైతే హోదాను తాము సాధించకుంటాం అంటే కూడా అడ్డం పడుతుంటే యువతకు బాబు వైఖరి అర్థం అవుతోంది. కచ్చితంగా ఇది వచ్చే ఎన్నికలపై ప్రభావం చూపిస్తుంది.

ఇలా ఎన్ని వర్గాలైతే బాబు మరోసారి అందలం ఎక్కడానికి సాయం పట్టాయో, అలా ఒక్కో వర్గాన్ని బాబు ఇప్పుడు దూరం చేసుకుంటున్నారు. ఇవన్నీ కలిపి, ఒక్కశాతం ఓటు బ్యాంకు ను అటు ఇటు మార్చినా చాలు. ఏ మీడియా, ఏ వర్గం అయితే బాబు పల్లకీని మోస్తోందో? అది అధికార పీఠం దగ్గరకు తీసుకెళ్లడం సాధ్యం కాదు. 

Show comments