మోడీజీ.. కాశ్మీర్‌పై నోరు మెదపరేం.?

మేం దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం.. అంటూ విదేశీ వేదికలపైనా హూంకరించేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, పాకిస్తాన్‌పై నిప్పులు చెరగడంలో అదరహో అన్పించేస్తున్నారుగానీ.. కాశ్మీర్‌ కల్లోలంపై దేశ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతున్నారు. పెద్ద పాత నోట్ల రద్దుతో తీవ్రవాదం అంతమైపోతుందని నరేంద్రమోడీ చేసిన ప్రకటన 'గాలి మాట' అయికూర్చుంది. 

నిజానికి కాశ్మీర్‌ ఈ నాడు కొత్తగా భగ్గుమనడంలేదు.. ఎప్పటినుంచో రావణకాష్టంగా రగులుతూనే వుంది. నరేంద్రమోడీ సర్కార్‌ హయాంలో ఆ రావణ కాష్టం కాస్తయినా చల్లారుతుందని అంతా ఎదురుచూశారు. తగ్గలేదు సరికదా, నరేంద్రమోడీ హయాంలో కాశ్మీర్‌ మరింత భగ్గుమంటోంది. పైగా, కాశ్మీర్‌లో బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. ముఫ్తీ సర్కార్‌తో బీజేపీ అక్కడ అంట కాగుతున్నా, కాశ్మీర్‌లో పరిస్థితులు ఏమాత్రం మెరుగపడ్డంలేదు. 

తాజాగా, అమరనాథ్‌ యాత్రపై తీవ్రవాదులు దాడులకు తెగబడ్డ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అమర్‌నాథ్‌ యాత్రపై తీవ్రవాదులు విరుచుకుపడ్డం ఇదే తొలిసారి కాదు. అయినాసరే, ఇది పూర్తిగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగానే పరిగణించి తీరాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రవాదుల ఏరివేత కాశ్మీర్‌లో జరుగుతున్నట్లు ప్రచారమైతే జరుగుతోందిగానీ, దానికి తగ్గ రీతిలో కాశ్మీర్‌లో తీవ్రవాదుల ఆగడాలు తగ్గకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. 

కాశ్మీర్‌లో కల్లోలం దేశ భద్రతకు సంబంధించిన అంశం. ఆ లెక్కన ప్రధాని నరేంద్రమోడీ, అత్యంత ప్రధాన్యత ఇవ్వదగ్గ అంశంగా కాశ్మీర్‌ కల్లోలాన్ని పరిగణించి తీరాలి. 'కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం.. కాశ్మీర్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాం..' అన్న కేంద్రం మాటలు నీటి మీద రాతల్లానే మిగిలిపోతున్నాయి.

Show comments