చకోర పక్షులు: వుండేనా.? ఊడేనా.?

తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముఖ్య నేతలు కొందరు 'మంత్రి' పదవి కోసం కిందా మీదా పడ్తున్నారు. పదవుల్లో వున్నవారేమో తమ పదవులు ఎప్పుడు ఊడతాయో తెలియక గింజుకుంటున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రి పదవుల్ని ఆశిస్తున్న, అనుభవిస్తున్న టీడీపీ నేతల పరిస్థితి ఇది. 

అదిగో పులి.. ఇదిగో తోక.. అన్న చందాన పదవుల పందేరంపై టీడీపీ నేతల అంచనాలే తప్ప, అధినేత మాత్రం పదవుల విషయంలో స్పష్టత ఇవ్వడంలేదు. కొత్తగా టీడీపీలోకి వచ్చినవారిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు అనుకుంటున్నారట. ఇదే ఇది రెండు మూడు నెలలుగా 'అట' మాత్రమే. అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడడంలేదు. చినబాబు నారా లోకేష్‌ని, పెదబాబు చంద్రబాబు.. ఢిల్లీకి పంపుతారనే ప్రచారం జరిగింది. అది కాస్తా తుస్సుమంది. రాష్ట్ర మంత్రి వర్గంలోకి లోకేష్‌ని తీసుకోవాలన్న డిమాండ్లు ఏపీ టీడీపీ నేతల నుంచి వచ్చాయి. రావడం కాదు, ఆ డిమాండ్లు కూడా చంద్రబాబు రప్పించినవే. 

పార్టీ ఫిరాయించినోళ్ళలో చాలామంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు తీరుతో చకోరపక్షుల్లా మారిపోయారంతే. జ్యోతుల నెహ్రూ, భూమా నాగిరెడ్డి, జలీల్‌ఖాన్‌, సుజయ కృష్ణ రంగారావు.. ఇలా పలువురు మంత్రి పదవుల్ని ఇంకా ఇంకా ఆశిస్తూనే వున్నారు. 

ఇక, కేంద్ర మంత్రి పదవుల విషయానికొస్తే, అశోక్‌ గజపతిరాజుకి పదవీ గండం.. అన్న ఊహాగానాలు ఈనాటివి కావు. సుజనా చౌదరి విషయంలో మరీ దారుణం. పదవి నుంచి ఆయన్ని ఏ క్షణాన అయినా పీకేయొచ్చంటూ ఢిల్లీ నుంచే లీకులు మీడియాకి అందుతున్నాయి. ఈ ఇద్దరి పదవులకే దిక్కు లేదు.. కొత్తగా మూడో పదవి, దాంతోపాటు మరొకటి కొసరు.. అంటూ ఏపీలో టీడీపీ లీకుల్ని పంపుతోంది. పైగా, కేంద్ర మంత్రి పదవికి జేసీ దివాకర్‌రెడ్డి పేరుని చంద్రబాబు ప్రతిపాదిస్తున్నారట. ఇంతకన్నా పెద్ద కామెడీ ఇంకేమన్నా వుందా.? 

అతి త్వరలో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ జరగనుందన్నది నిర్వివాదాంశం. ఆంధ్రప్రదేశ్‌ తరఫున ఇప్పటికే కేంద్రంలో చాలామంది వున్నారు. వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజు, నిర్మలా సీతారామన్‌, సుజనా చౌదరి.. కొత్తగా సురేష్‌ ప్రభు. లెక్క అదిరిందిగానీ, రాష్ట్రానికి ఉపయోగపడేవాళ్ళే కనిపించడంలేదిక్కడ. వీరెవరూ రాష్ట్రం కోసం పనిచేస్తున్న దాఖలాల్లేవు. కొత్తగా పదవులు అడిగితే, ఇతర రాష్ట్రాల నుంచీ అభ్యంతరాలొస్తాయన్నది బీజేపీ అధినాయకత్వం వాదన. 

మంత్రి వర్గ విస్తరణలో సుజనా చౌదరిని పీకేడయం ఖాయమని, ఆ స్థానంలో ఎవరో ఒకరికి ఛాన్స్‌ రావడం కూడా కష్టమేనన్నది తాజా ఖబర్‌. ఇప్పుడున్న రెండిటికి తోడు, టీడీపీ మరొక్కటి సాధించినా అది ఆ పార్టీ పరంగా అద్భుతమే. రాష్ట్రానికి ఒరిగేదేమీ వుండదనుకోండి.. అది వేరే విషయం. 

కొసమెరుపు: పదవుల పందేరం పేరుతో.. టీడీపీ అనుకూల మీడియా లీకుల్ని, కథనాల్ని ప్రచారంలోకి తేవడం, అవి చూసి, టీడీపీ నేతలు, టీడీపీలో చేరిన పార్టీ ఫిరాయించిన నేతలు.. చకోర పక్షుల్లా ఎదురుచూడటం.. ఇదంతా ఓ ప్రసహనంగా మారిపోయింది.

Show comments